‘ఎం.ఎల్.ఏ’ అని పేరు పెట్టినంత మాత్రాన… ఈ కథకూ, రాజకీయాలకూ సంబంధం లేదని చిత్రబృందం మొన్నామధ్యే గట్టిగా చెప్పింది. అయితే తెలుగు 360 మాత్రం.. ఇది రాజకీయ చిత్రం అని బల్లగుద్ది మరీ సెలవిచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది. ఎం.ఎల్.ఏ… రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా. ఈ సంగతి ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సరదాగా మొదలై, ప్రేమ కథలో దిగి, ఆ తరవాత యాక్షన్ బాటెక్కి, ఆపై.. రజనీకాంత్ స్టైల్లో పొలిటికల్ పంచ్‌లు వేశాడు.. ఈ ఎం.ఎల్.ఏ.
”పిల్లలకు ఆస్తులిస్తే అవుంటేనే బతుకుతారు. అదే చదువిస్తే ఎలాగైనా బతుకుతారు” అనే కాజల్ డైలాగ్ ఈ సినిమా కాన్సెప్టేంటో చెబుతుంది. అక్కడి నుంచి కథ యూ టర్న్ తీసుకుంటుందని స్పష్టమైపోయింది.
”ఎం.ఎల్.ఏ గా గెలవడం అంటే సినిమా డైలాగులు చెప్పడం.. చిందులేయడం కాదు”
”నేనింకా రాజకీయం చేయడం మొదలెట్టలేదు. మొదలు పెడితే మీరు చేయడానికి ఏం మిగలదు”
”నా జనం బ్యాక్ ఉండరు.. బ్యాలెట్ బాక్సుల్లో ఉంటారు”
– ఈ డైలాగులు చాలు.. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సాగుతుందని అని క్లారిఫై చేయడానికి. ట్రైలర్లో విషయం అంతా చెప్పేసినప్పుడు… ”అబ్బే.. ఇది పొలిటికల్ సినిమా కాదు” అని దర్శక నిర్మాతలు రెండు రోజుల క్రితమే… సర్ది చెప్పడానికి ట్రై చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి ఇందులో అన్ని కమర్షియల్ హంగులూ రంగరించారు. ఈసారీ.. కల్యాణ్ రామ్ యాక్షన్‌తో కూడిన వినోదాన్ని నమ్ముకున్నట్టు అర్థం అవుతోంది. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్లో ఉన్న కిక్కు.. సినిమాలోనూ ఉంటే… ఎం.ఎల్.ఏ పోటీలో గెలిచినట్టే.