ఏపీలో ఉన్న తమిళుల్ని ఆదుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఎమ్మెల్యే రోజా కోరారు. రోజా తన భర్త సెల్వమణితో కలిసి స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశ ఎజెండా ఏపీలో ఉన్న తమిళులను ఆదుకోవడం. ఆంధ్రప్రదేశ్‌లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇవ్వాలని.. అలాగే ఒక్కొక్క తరగతి విద్యార్థికి రూ. 1000 చొప్పున మంజూరు చేయాలని కోరారు. అలాగే తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళనాడు పౌరులకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని .. ఏపీలోని తమిళులకు కల్పించాలనికోరారు.
నగరి నియోజకవర్గంలో తమిళులు ఎక్కువ మంది ఉంటారు. రోజా రెండు గెలవడానికి తమిళుల ఓట్లే కీలకం. గతంలో తమిళ ఉద్యమాలు చేసిన సెల్వమణి రోజా కోసం విస్తృతంగా ప్రచారం చేసేవారు. అయితే తమిళులన్న కారణంగా వారికి ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదు. తమిళ మీడియంలో చదువుతున్న వారికి అమ్మఒడి లాంటి పథకాలు వర్తించడం లేదు. అటు తమిళనాడు పథకాలు అందక.. ఇటు ఏపీ ప్రభుత్వం పట్టించుకోక వారు అసంతృప్తిలో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చల్లాచర్చడానికి రోజా తమిళనాడు సీఎంను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
రోజాకు ఇప్పటికే నగరిలో ఇంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఆమె ప్రత్యర్థులకు హైకమాండ్ రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారని వైఎస్ఆర్సీపికి రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆదివారం ఈ అంశాన్ని ఖండించారు. తాను జగన్‌ను వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు.