హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు ప్రకటనలు చేస్తున్నారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే కలకలం రేపుతూంటే…రోజా కూడా రంగంలోకి దిగారు.
జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఏం చేసుకుంటారో చేసుకోండని రోజా సవాల్ చేశారు. అంతటితో వదిలిపెట్టలేదు.. వచ్చేమూడేళ్లు మాత్రమే కాదు.. జగన్ మరో పాతిక, ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారని.. అన్నేళ్లు ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండానే తిరుమల దర్శననానికి వెళ్తారని ప్రకటించారు.
ఓ వైపు హిందూ సంస్థలు కొడాలి నాని వ్యాఖ్యలతోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో రోజా కూడా..దానికి కొనసాగింపుగా వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంస్థలు మరింతగా భగ్గమనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీవారిపై నమ్మకంతోనే తిరుమలకు వెళ్తున్నప్పుడు ఆ మేరకు విశ్వాసం ఉందని ఓ డిక్లరేషన్ ఇస్తే సమసిపోయే వివాదాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా పెద్దది చేస్తున్నారో కానీ.. వైసీపీలో నోరున్న నేతలు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. కొంత మంది పీఠాధిపతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే మంత్రులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అందుకే వారిని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.
వివాదాన్ని వైసీపీ నేతలు పెద్దది చేస్తూంటే.. బీజేపీ నేతలు.. హిందూత్వసంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి. వారి స్థాయిలో వారు ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్ ఇంటిని భజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. తిరుపతిలో జగన్ పర్యటన సందర్భంగా కర్ఫ్యూ విధించారు. వివాదాస్పద నిర్ణయాల కారణంగా జగన్ ఎక్కడకు వెళ్తే అక్కడ కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నా వైసీపీ నేతలు మాత్రం… తమ రాజకీయం తాము చేస్తున్నారు.