వైకాపా ఎమ్మెల్యే రోజా మళ్ళీ ఇవ్వాళ్ళ చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. “గుంటూరు-విజయవాడ ప్రాంతాలలో నేటికీ కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యాపారాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడే ఒక వివాహిత మహిళను వేధిస్తున్నాడు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుకి ఆడపిల్ల ఉండి ఉంటే ఆడవాళ్ళ కష్టాలు ఏమిటో తెలిసొచ్చేవి. ఆయన ఈ కాల్ మనీ వ్యాపారుల బారి నుంచి భాదిత మహిళలను కాపాడే ప్రయత్నం చేయకుండా, కాల్ మనీ నిందితులను కాపాడుతున్నారు. సాటి మహిళల సమస్యల గురించి శాసనసభలో మాట్లాడినందుకు నాపై కక్ష గట్టి ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయించారు. తెదేపాలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి స్పీకర్ అధికారాలని కూడా దుర్వినియోగం చేయడానికి ఆయన వెనుకాడ లేదు. తెలంగాణా శాసనసభలో తెదేపా సభ్యులు స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే తెదేపా ప్రభుత్వం స్పీకర్ అధికారాలను దుర్వినియోగం చేసి, బలవంతంగా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుంది.” అని రోజా ఆరోపించారు.
కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయని రోజా చెప్పడం, దానిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడే ఉన్నాడని చెప్పడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవహారం బయటపడినప్పుడు పోలీసులు హడావుడిగా కొందరిపై కేసులు నమోదు చేశారు. ఆ తరువాత వైకాపా ఈ సమస్య నుంచి మరో సమస్యకి జంప్ అయిపోవడంతో పోలీసుల హడావుడి కూడా తగ్గింది. అంటే దానర్ధం రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యాపారుల ఆగడాలు పూర్తిగా సమసిపోయినట్లు కాదని, ఆ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోయిందని రోజా చెపుతున్న మాటలను బట్టి అర్ధమవుతోంది. కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యను శాస్వితంగా పరిష్కరించవలసి ఉంది. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపితే వైకాపా ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు గట్టిగా పోరాడితే అందరూ హర్షిస్తారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషిస్తారు.