వైకాపా ఒక సైకో పార్టీ అని తెలుగు దేశం నేతలు ఎద్దేవా చేస్తుంటే, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు తెదేపాలో జిల్లాకో సైకో సూదిగాడు తయారయ్యాడని వైకాపా ఎమ్మెల్యే రోజా ఘాటుగా బదులిచ్చారు. అందుకు ఆమె మంచి థియరీ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆడపిల్లలు లేనందునే ఆయనకి మహిళల విలువ ఏమిటో తెలియడం లేదని, అందుకే ఆ పార్టీలో సైకో సూదిగాళ్ళు తెగ రెచ్చిపోతున్నారని విమర్శించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం కటినంగా వ్యవహరించి ఉండి ఉంటే భానుప్రీతి అనే విద్యార్ధిని ఆత్మహత్యను నివారించగలిగి ఉండేవాళ్ళం కదా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, మహిళా అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధులు,విద్యార్దునులకు భద్రత కరువయిందని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నానాటికీ దౌర్జన్యాలు, విద్యార్ధినుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చీమ కుట్టినట్లు కూడా లేదని, మంది మార్బలాన్ని వెంటేసుకొని హాయిగా విదేశీయాత్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వంలో మహిళా మంత్రులయినా కనీసం ఈ సమస్యపై స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
అధికార ప్రతిపక్ష పార్టీల వాదోపవాదనలు పక్కనబెట్టి ఆలోచిస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితిపై రోజా చెప్పిన మాటల వాస్తవం ఉందని అంగీకరించక తప్పదు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగాయి. తహసిల్దార్ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అతనిని వెనకేసుకు రావడంతో పార్టీ నేతలకి, ప్రజలకి కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది.
తల్లి తండ్రులు లక్షలు చెల్లించి కార్పోరేట్ కాలేజీలలో తమ ఆడపిల్లలను చేర్చితే వారు చదువులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. ర్యాగింగ్ భూతానికి ఎప్పుడు ఎవరు బలయిపోతారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు తల్లి తండ్రులు ఆడపిల్లలను కార్పోరేట్ కాలేజీలకు పంపేందుకు పంపడానికి కూడా ఇష్టపడకపోవచ్చును.
ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, ‘రాష్ట్రంలో ఏ కాలేజీలోకూడా విద్యార్ధులు ర్యాగింగ్ పేరు ఎత్తేందుకు కూడా భయపడే విధంగా కటినమయిన చట్టాలు తెస్తామని’ మంత్రి గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కానీ నేటికీ రాష్ట్రంలో విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆగకపోవడం గమనిస్తే ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని స్పష్టం అవుతోంది. రోజా చేసిన విమర్శలను అధికార పార్టీ రాజకీయకోణంలో చూడకుండా ఒక సద్విమర్శగా స్వీకరించి తక్షణమే తగు చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తెలంగాణాలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లే, ఆంధ్రాలో మహిళలు, విద్యార్ధినులు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి.అది ఎవరికీ మంచిది కాదు.