ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దురుసుగా వ్యవహరించినందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయబడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ అందుకు తానేమీ బాధపడటం లేదని చెప్పడంతో చాలా విమర్శలు వచ్చేయి. ఆమె తన సినిమా, టీవీ కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే ఆమె సభ నుండి ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసినా బాధపడటం లేదని ఉంటారని వ్యాఖ్యలు వినిపించాయి. ఆమె మాటలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లుగా గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఇవ్వాళ్ళ సభలో డిమాండ్ చేసారు.
తనను సస్పెండ్ చేసినందుకు బాధపడలేదని నిన్న చెప్పిన రోజా, ఈరోజు మళ్ళీ అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసారు. అసెంబ్లీలో ఉన్న వైకాపా కార్యాలయానికి ఆమె వెళ్లబోతుంటే మార్షల్స్ ఆమెను వారించారు. కానీ ఆమె మొండిగా లోపలకి వెళ్ళే ప్రయత్నించడంతో మహిళా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఆ తోపులాటలో రోజా స్పృహ తప్పి పడిపోయారు. అది నిజమో నటనో ఆమెకే తెలియాలి. ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి వచ్చేరు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసుల చేత ఆమెను దౌర్జన్యంగా అరెస్ట్ చేయించడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు.
అయితే ఆమెను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ నిన్న ప్రకటిస్తునపుడు, ఆమె కాని జగన్మోహన్ రెడ్డి గానీ పెద్దగా నిరసన వ్యక్తం చేయలేదు. కానీ ఇవ్వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం, నిబంధలకు విరుద్దం, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటూ జగన్మోహన్ రెడ్డి బిగ్గరగా వాదిస్తున్నారు. మరి ఈ మాటలన్నీ నిన్ననే ఆమెను సస్పెండ్ చేసినప్పుడే ఎందుకు అనలేదు?ఆమె స్పీకర్ ని కలిసి క్షమాపణలు చెప్పి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని నిన్ననే ఎందుకు అడగలేదు? కనీసం ఇవ్వాళ్ళ స్పీకర్ ని కలిసి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని కోరుతానని నిన్న అనలేదు. కానీ ఇవ్వాళ్ళ శాసనసభకు వచ్చి ఇంత హడావుడి ఎందుకు చేసిన్నట్లు? అంటే తన గురించి ప్రజలు ఏమనుకొంటారో అని భయపడే అని అనుకోవలసి ఉంటుంది.