‘సారీ’ అనే మాట చెబితే తాను తప్పు చేసినట్టే అవుతుందంటూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట చెప్పబోయేది లేదంటూ.. హక్కుల కమిటీ ముందు తన వివరణ మాత్రమే చెబుతానంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా ఎంతగా మొండిపట్టు పట్టినా చివరాఖరికి దిగిరాక తప్పలేదు. మొత్తం ఈ సినిమాలో 13 రీళ్ల పాటు యాక్షన్ ఎమోషనల్ డ్రామాను నడిపించిన రోజా క్లయిమాక్స్‌ను చప్పగా ముగించింది. హక్కుల కమిటీ ఇచ్చిన చివరి నోటీసును అనుసరించి… బుధవారం మధ్యాహ్నం శాసనసభలో కమిటీ ముందు హాజరైన రోజా.. తనను సభలో తెలుగుదేశం సభ్యులే టార్గెట్ చేశారంటూ ఎదురు ఆరోపణలు చేశారు. అయితే ఆమె హావభావాలు, మాట్లాడిన మాటలు రికార్డుల్లోంచి చెప్పడంతో రోజా దిగిరాక తప్పలేదు. తన మాటలు అనితను బాధించి ఉంటే క్షమించాలంటూ రోజా మొత్తానికి సారీ చెప్పేశారు.
నిజానికి తొలినుంచి తాను మీడియా ముఖంగా చేస్తున్న వాదననే హక్కుల కమిటీ ముందు కూడా వినిపించి నెగ్గుకురావడానికి రోజా ప్రయత్నించినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని, తననే తెలుగుదేశం టార్గెట్ చేసిందని ఆమె ఆరోపించారు. అయితే ఆమె మాటలు, హావభావాలకు సంబంధించిన వీడియోలను కూడా సభ్యులు ఈ భేటీలో చూపించడంతో ఆమెకు ఇక తప్పించుకోవడం, దబాయించడం సాధ్యం కాదని అర్థమైపోయినట్లు చెబుతున్నారు. ఆమె క్షమాపణ చెప్పిన సంగతిని కమిటీ సభ్యుడు బండారు ధ్రువీకరించారు. కమిటీ నివేదికను త్వరలోనే స్పీకరు దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. ఆ తర్వాత స్పీకరు నిర్ణయం ఉంటుందని అంటున్నారు గానీ.. సస్పెన్షన్ ఉపసంహరణ జరగవచ్చునని అంతా భావిస్తున్నారు.
రోజా సస్పెన్షన్ వ్యవహరం ఇక్కడితో ఒక కొలిక్కివచ్చినట్లే భావించవచ్చు. ఎటూ ఆమె సారీ చెబితే సస్పెన్షన్ ఎత్తివేయడానికి హక్కుల కమిటీ గానీ, స్పీకరు గాని తొలినుంచి సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే రోజానే దీనిని తెగేవరకు లాగారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకసారి తమ మాటలు రికార్డుల్లోకి దొరికిపోయిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ సారీ చెబితే వివాదపు ఊబిలోంచి బయటపడడం కష్టం అనేది సభ్యులకు తెలిసి ఉండాలి. ఆ విజ్ఞత ఉన్నది గనుకనే.. ఆమెతో పాటు అదే తరహా కంప్లయింట్లు ఎదుర్కొన్న వైకాపాకే చెందిన నలుగురు సభ్యులూ వెంటనే సారీ చెప్పేసి సభలో కంటిన్యూ అయిపోయారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రోజా మాత్రం భీష్మించుకుంది. న్యాయపోరాటం ప్రారంభించింది. అది ఒక పట్టాన తేలే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈలోగా ప్రాక్టికల్‌గా వాస్తవాన్ని అర్థం చేసుకున్న రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు బుధవారం క్షమాపణ కోరి సమస్యనుంచి బయటపడింది. దీని పర్యవసానంగా ఆమె మీద ఏడాది పాటు విధించిన సస్పన్షన్ను ఎత్తి వేయవచ్చునని పలువురు భావిస్తున్నారు.