సినీరంగంలో మంచిపేరు సంపాదించుకొన్న రోజా, రాజకీయాలలో కూడా తన మాటలతో సత్తా చాటి చూపుకొంటూ ఇంకా పాపులర్ అయ్యారు. అటువంటి వ్యక్తి మళ్ళీ పాపులారిటీ కోసం ప్రాకులాడనవసరమే లేదు. కానీ నేటికీ ఆమెకి ఆ యావ తగ్గలేదు. రాజకీయంగా తన సత్తా చాటి చూపుకోవాలని ప్రయత్నించకుండా కేవలం నోటితోనే బ్రతికేస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం చంద్రబాబు నాయుడు నామస్మరణతో తరించిపోతుంటే, ఆమె పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయకుండా ఉండలేరు. నిన్న తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం వైకాపా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నప్పుడు కూడా ఆమె దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడటమే అందుకు నిదర్శనం.
పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలనుకొంటే సినిమాలు పూర్తిగా వదులుకొని స్వర్గీయ ఎన్టీఆర్ లాగ పూర్తి స్థాయి రాజకీయాలలోకి రావాలని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో ఏదో ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి, ఏడాదికో మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం రాజకీయం కాదు, దమ్ముంటే సినిమాలు వదులుకొని రాజకీయాలలోకి రావాలని ఆమె పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ భాజపా, తెదేపా తరపున హామీలు ఇచ్చారని కనుక వాటికి ఆయన కూడా జవాబుదారి అవుతారని ఆమె అన్నారు. తెదేపా, భాజపాలు ఆ హామీలని నిలబెట్టుకోలేకపోయాయి కనుక పవన్ కళ్యాణ్ వాటికి ఇంకా తొత్తులాగ, గోడ మీద పిల్లిలాగ వ్యవహరించకుండా కొమరం పులిలా ప్రజలతో కలిసి వాటితో హామీల అమలుకోసం పోరాడాలని రోజా అన్నారు.
రోజా ఏ ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ పై ఈవిధంగా విమర్శలు చేస్తూ ఆయనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం అవుతూనే ఉంది. ఆమె విమర్శలకి పవన్ కళ్యాణ్ స్పందిస్తుండటం వలననే ఆమె తన విమర్శలు కొనసాగిస్తున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ కూడా డ్డీ కొనగల ఏకైక మహిళా నాయకురాలు తానేనని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. తెదేపా ఎమ్మెల్యే అనిత, ముఖ్యమంత్రిపై ఆమె చేసిన విమర్శల కారణంగానే శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అవడం, అనక హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు వేయించుకోవడం జ్ఞాపకం చేసుకొన్నట్లయితే, ఈవిధంగా వ్యక్తులని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అర్ధం అవుతుంది. అయినా రోజా తన నోటినే నమ్ముకొని బ్రతుకుతున్నారు కనుక ఆమెకి అటువంటి చేదు అనుభవాలు అప్పుడప్పుడు ఎదుర్కోవలసిరావచ్చు.