వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఒక సస్పెన్స్ సీరియల్ లాగ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సుప్రీం కోర్టులో దీనిపై ఆమె న్యాయపోరాటం కొనసాగుతుండగానే, మరోపక్క శాసనసభ హక్కుల కమిటీలో కూడా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సంజాయిషీ చెప్పుకొనేందుకు శాసనసభ హక్కుల కమిటీ ఆమెకి వరుసగా నాలుగుసార్లు అవకాశం కల్పించినప్పటికీ ఆమె ఏవో కారణాల చేత కమిటీ ముందు హాజరుకాలేదు. మళ్ళీ మరోసారి పిలిస్తే తప్పకుండా హాజరయ్యి వివరణ ఇచ్చుకొంటానని చెప్పారు కానీ క్షమాపణ మాత్రం కోరబోనని స్పష్టం చేసారు. క్షమాపణ కోరడం అంటే చేయని తప్పును ఒప్పుకొన్నట్లే అవుతుందని ఆమె అన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిందే శాసనసభలో అనుచితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు సిఫార్సు చేయడానికి. కనుక దాని ముందు హాజరయ్యి క్షమాపణలు చెప్పుకొన్నవారిని క్షమించి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సిఫార్సు చేసింది. కానీ కమిటీ ముందు హాజరవడానికి కూడా రోజా ఇష్టపడక పోవడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, ఆ ఏడాది సమయానికి ఆమెకు ఎమ్మెల్యే అలవెన్సులు కూడా చెల్లించవద్దని కమిటీ సిఫార్సు చేసింది. కానీ మళ్ళీ ఆమెకు మరొక అవకాశం ఇవ్వాలని భావించి, ఈనెల 6వ తేదీన కమిటీ ముందు హాజరు కావలసిందిగా కోరుతూ ఆమెకు ఇవ్వాళ్ళ నోటీసులు పంపించింది. కమిటీ ఒక మెట్టు దిగి ఆమెకు అవకాశం కల్పిస్తున్నప్పుడు ఆమె కూడా ఒక మెట్టు దిగి కమిటీకి క్షమాపణలు చెప్పడమే వివేకమనిపించుకొంటుంది. అలా కాక ఆమె తన వైఖరికే కట్టుబడి ఉండాలనుకొన్నట్లయితే, ఆమెపై ఇదివరకు సిఫార్సు చేసిన క్రమశిక్షణ చర్యలనే అమలుచేయవచ్చని కమిటీ శాసనసభకు సిఫార్సు చేయడం తధ్యం. కనుక రోజా కూడా ఈ ఆఖరి అవకాశాన్ని వినియోగించుకొని తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయించుకోవడమే మంచిది. కానీ రోజా ఏమి నిర్ణయించుకొంటారో చూడాలి.