జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,, ఇంచార్జ్ లతో సమావేశం అయ్యారు. గుర్తొచ్చినప్పుడల్లా ఈ సమావేశం నిర్వహిస్తూంటారు. అంతా ఐ ప్యాక్ కనుసన్నల్లో జరుగుతూ ఉంటుంది. తాజాగా మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేల్లో కనీస ఉత్సాహం కనిపించలేదు. కానీ జగన్ రెడ్డి ఎప్పుడూ వేసే క్యాసెట్టే వేశారు. దీంతో ఎమ్మెల్యేలకూ కొత్తేమీ లేదు. ఎవరూ సంభ్రమాశ్చర్యాలకు లోను కాలేదు. ప్రతీ సారి కొన్ని పేర్లు చదివి వీరికి హెచ్చరిక అనేవారు. ఈ సారి అలాంటి హెచ్చరికలు చేయలేదు. కొంత మంది కి టిక్కెట్లివ్వలేనని.. కానీ వారు తన మనుషులేనని … ఐ ప్యాక్ రాసిచ్చిన స్క్రిప్ట్ లోమ మాటల్ని చదివి నిపించారు.
జగన్ రెడ్డి రెండు కొత్త కార్యక్రమాల్ని ప్రకటించారు. ఒకటి జగనన్న సురక్ష.. ఇంకోటి ఆంధ్రాకు జగన్ రెడ్డి ఎందుకు? అనే కార్యక్రమం. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం పేరులా జగనన్న సురక్షా ఉందని.. గోడలపై ఇప్పటికీ ఆ పేర్లు కనిపిస్తూనే ఉంటాయని ఎమ్మెల్యేలు సెటైర్లు వేసుకున్నారు, ఇక ఆంధ్రాకు జగన్ రెడ్డి ఎందుకు? అంటే… ఏం చెప్పాలని… ఎమ్మెల్యేలే గుసగుసలాడుకున్నారు. ఓటు బ్యాంకుకు మాత్రమే ఇచ్చే కొన్ని పథకాలు.. అంతకు మించి అందరి వద్ద వసూలు చేస్తున్న పన్నుల గురించి ఇప్పటికే ప్రజలు నిలదీస్తున్నారు.
ఒక్క అభివృద్ధి లేకపోగా.. అరాచకం పరిధులు దాటిపోయింది. ఇలాంటి పరిస్తితుల్లో జగన్ రెడ్డి ఎందుకో అంటే ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కాలేదు. ఇది జగన్ రెడ్డికి అర్థం అయిందేమో కానీ… దీనిపై ఐ ప్యాక్ పూర్తి స్థాయి సరంజామా ఇస్తుందని చెప్పారు. జగన్ రెడ్డి ఐ ప్యాక్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన తర్వాత.. ఐ ప్యాక్ రిషిరాజ్… జగన్ స్టైల్లో ఎమ్మెల్యేలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏం చేయాలో చెప్పారు. ఆయన చెప్పిందే కాస్త అర్థమయిందని ఎమ్మెల్యేలు గొణుక్కున్నారు.
టిక్కెట్లు వస్తాయా లేదా అని పెద్దగా ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నంత నిర్లిప్తతలోకి మెజార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయేవారు. గతంలో ఇలాంటి సమావేశాలు జరిగితే.. అంతా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు అసలు ఏ మీడియా కూడా .. పట్టించుకోలేదు.