రాజ్యసభ సభ్యులు గెలిస్తే సీఎం కాలేరని .. ఎమ్మెల్యేలు గెలిస్తేనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్‌కు సూటిగా మీడియా ద్వారా సందేశం పంపారు. టీడీపీ గెలిచి వైసీపీలో కుమారుల మెడలో కండవాలు వేయించి ఆ తర్వాత అధికారికంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహించేస్తూ.. టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించేస్తున్న ఈయనకు తర్వాత పొగపెట్టారు. విజయసాయిరెడ్డి ఈ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టి… మరో నేతను ప్రోత్సహించారు.
కార్పొరేటర్లందర్నీ ఆయనపై రెచ్చగొట్టారు. దాంతో ఆయన వైసీపీలో ఒంటరయ్యారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతలనుంచి తప్పించారు. కొత్తగా వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి వచ్చారు. దీంతో వాసుపల్లి కొత్తగా గొంతు పెగల్చుకుంటున్నారు. తనను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని.. నియోజకవర్గంలో గెలవాలంటే…కావాల్సింది రాజ్యసభ సభ్యులు.. కార్పొరేటర్లు కాదని చెబుతున్నారు. ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ దక్కే అవకాశం లేకపోవడం.. వైసీపీలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఆయనపై ఇప్పటికే వైసీపీ ఆశలు వదిలేసుకుందని.. ప్రత్యామ్నాయ నేతను చూసుకుందని.. వాసుపల్లి గణేష్ రెంటికి చెడ్డ రేవడి అయ్యారన్న ప్రచారం విశాఖలో జరుగుతోంది. కానీ ఆయన మాత్రం చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ అవి కూడా నెగెటివ్‌గా వెళ్తున్నాయి. కొత్త ఇంచార్జ్ సుబ్బారెడ్డి అయినా వాసుపల్లి బాధను ఆలకిస్తారో లేదో చూడాలి.