టీడీపీ నేతలకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబును మెచ్చుకునేవాళ్లలో భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఒకప్పుడు ఉండేవారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేయడంతో సహజంగానే భాజపా నేతలు విమర్శలు పెంచారు. ఆ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భాజపాను వీడి జనసేనలో చేరుతున్న సందర్భంగా… విష్ణుకుమార్ కూడా కాషాయ కండువా తీసేస్తారనే ప్రచారం బాగానే జరిగింది. ఈ వార్తల్ని ఆయన ఖండించాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు మరోసారి అదే అంశంపై కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పనంటూ చమత్కించారు! ఎందుకంటే, ఇప్పుడు అలాంటివి చెప్పేస్తే… తరువాత తనకు మీడియాలో ప్రాధాన్యత దక్కదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది స్పష్టంగా చెబుతా అన్నారు. ఈ వ్యాఖ్యల్లో అంతరార్థమేంటో మరి?
రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను డబుల్ చేయడం కచ్చితంగా ఎన్నికల స్టంటే అంటూ ఓ పదిరోజుల కిందటే విష్ణుకుమార్ ఖండించారు. సభల పేర్లతో ప్రజా ధనాన్ని టీడీపీ నేతలు లూఠీ చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే, ఇవాళ్ల ఇదే అంశమై ఆయన మాట్లాడుతూ… పెన్షన్లు పెంపు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం లాంటి కార్యక్రమాలు టీడీపీకి కచ్చితంగా సానుకూలమైన అంశాలు అవుతాయని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా సాయం ప్రకటిస్తే… అధికార పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరుగుతుందన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి మరోసారి జనసేన అవసరం ఉన్నట్టుందనీ, అందుకే ఈ మధ్య టీడీపీ నేతలు పవన్ మీద విమర్శలు తగ్గించారన్నారు.
ఆంధ్రాలో భాజపా పొత్తు గురించి కూడా కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యే చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు వస్తారనడం విశేషం. సరిగ్గా పదిరోజుల కిందటే… ఎన్ని పార్టీలు కలిసినా భాజపాని ఏం చెయ్యలేవు, ఆంధ్రాలో 175 స్థానాల్లో తాము గెలుస్తున్నామని ధీమాగా చెప్పారు. కానీ, తమతో పొత్తుకు ఎవరు ముందుకొస్తారని ఇప్పుడు ఇంకోలా చెబుతున్నారు. మొత్తానికి, భాజపాని ఉద్దేశించి విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలు కాస్త ట్రికీగా ఉన్నాయి. ఆయన స్పందించిన తీరులో రెండు అర్థాలు ధ్వనిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలో మార్పు అయితే సుస్పష్టం.