ఏపీలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తుండటంతో క్యాడర్ లో కూడా అయోమయం నెలకొంది. ఈ క్రమంలోనే వైసీపీ ఒంటరిగా రాజకీయం చేసే పరిస్థితి లేదని, ఏదో ఓ గూటికి చేరడం లేదా విలీనం కావాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పిల్ల కాలువలు సముద్రంలాంటి కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందేనని..వైసీపీని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే..తాజాగా విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బిగ్ బాంబ్ పేల్చారు.
బీజేపీతో వైసీపీ విలీనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వైసీపీ విలీనం ఎట్టి పరిస్టితుల్లో అంగీకరించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. వైసీపీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని , అసలు ఏపీలో వైసీపీకి ఎలాంటి బలం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఐదు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
బీజేపీలో వైసీపీ విలీనం అనే అంశంపై అసలు ఎక్కడా చర్చ లేదు. అయినా విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని కొట్టిపారేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.