ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ఏ వైపు చూసినా రాజకీయ పార్టీల నేతలు సవాళ్లు చేసుకుంటున్నారు. మొదట తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య జరిగిన రాజకీయ పోరాటంలో… దేవుడి ఎదుట ప్రమాణాలే హైలెట్ అయ్యాయి. ఇదేదో పబ్లిసిటీకి దగ్గర దారిలాగుందని అనుకున్నారో.. లేకపోతే.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి నిజాయితీకి సర్టిఫికెట్లుగా చెప్పుకోవడానికి దేవుడి ముందు ప్రమాణాలే సులువుగా కనిపిస్తున్నాయనుకున్నారేమో కానీ ప్రమాణాలు చేద్దాం..రండి అని సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రస్తుతం.. విశాఖలో ఈ సవాళ్లు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై విజయసాయిరెడ్డి అనేకానేక ఆరోపణలు చేశారు.
అయితే.. వెలగపూడి సైలెంట్‌గా లేరు. ఆయన తన దగ్గర ఉన్న పత్రాలు విడుదల చేసి.. దమ్ముంటే.. తేల్చుకుందాం..రా అని సవాల్ చేశారు. దానికి ఆయన గుళ్లో ప్రమాణం సవాల్ చేశారు. ఈ సవాల్‌పై వెనక్కి తగ్గితే బాగుండదని.. వైసీపీ నేతలు ముందుకొచ్చారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. వెలగపూడి రౌడీ అని ఆయన.. ప్రమాణాలు చేస్తే నమ్మేదెవరని చెప్పి వైదొలిగారు. కానీ వైసీపీ నేతలు మాత్రం రచ్చ చేశారు. మరో వైపు.. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా అంతే. ఆయన శ్రీశైలం ఆలయం మొత్తాన్ని ముస్లింల గుప్పిట్లో పెట్టారని.. అక్కడి వ్యాపారాలన్ని వారికే ఇచ్చేశారని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
దీనిపై చక్రపాణి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. పెద్దల సమక్షంలో శ్రీశైలంలో చర్చకు కూర్చుందామని.. సవాల్ చేశారు. అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని తనపై హిందూ ద్రోహిగా ముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఈ తరహా సవాళ్లు నడుస్తున్నాయి. అయితే అవన్నీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి తప్ప.. వారిలో నిజంగా ఎవరు అవినీతికి పాల్పడ్డారో.. ఎవరు పాల్పడలేదో.. తేలేందుకు ఉపయోగపడటం లేదు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలకు మాత్రం.. చేసుకుంటున్నారు.