తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలోకి ఫిరాయించిన పది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ఇప్పుడు? వారేమో.. మేం తెరాసలో చేరిపోయాం.. మమ్మల్ని ‘అసలు తెలుగుదేశం’ పార్టీగా గుర్తించి.. మేం తెరాసలో విలీనం అవుతున్నట్లుగా ప్రకటించాలి అని వారు లేఖ ఇచ్చారు. అందులో పది మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. ఆ లేఖే ఇప్పుడు వారి మెడకు గుదిబండలా చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఆ లేఖ పుణ్యమాని వారి మీద అనర్హత వేటు పడే పరిస్థితి దాపురించినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు. సాంకేతికంగా చూసినప్పుడు రాజ్యాంగపరమైన కొన్ని నిబంధనలు ‘విలీనం’ కు ఆస్కారం కల్పించడం లేదని.. ఆ నేపథ్యంలో.. వారందరూ పార్టీ ఫిరాయించినట్లుగా భావించి వారి మీద అనర్హత వేటు వేయాలని రేవంత్ రెడ్డి స్పీకరు కు చేసిన ఫిర్యాదు విలువ పెరిగే అవకాశం ఉంది.
ఎర్రబెల్లి తదితరులు స్పీకరుకు ఇచ్చిన లేఖలో రాజ్యాంగం పదో షెడ్యూలు నాలుగో పేరా ప్రకారం విలీనం కావడానికి సరిపడా సభ్యుల సంఖ్య ఉన్నందున.. తమ పార్టీ శాసనసభా పక్షం తెరాసలో విలీనం అయినట్లుగా గుర్తించాలని కోరారు. సరిగ్గా ఈ పాయింటునే తెలుగుదేశం పార్టీ కూడా పట్టుకుంది. రాజ్యాంగం పదో షెడ్యూలు మొత్తం పార్టీ విలీనానికి సంబంధించిన విధివిధానాలే ఉన్నాయి తప్ప.. ప్రత్యేకంగా శాసనసభా పక్షం విలీనానికి వర్తించే నిబంధనలు అందులో లేవని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అంటున్నారు. ఇది నూటికి నూరుశాతం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని తెదేపా వాదిస్తోంది.
ఈ అంశాన్ని ఆధారం చేసుకునే తెతెదేపా అసెంబ్లీ కొత్త ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి పార్టీ మారిన తమ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ స్పీకరుకు ఫిర్యాదు చేశారు. గతంలో అయిదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయని.. తాజాగా మరో అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడం గురించి కూడా ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని అదే పదో షెడ్యూలును ఉదాహరిస్తూ దానికి పూర్తిగా ఫిరాయించిన ఎమ్మెల్యేల చర్య విరుద్ధం అంటూ రేవంత్ ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరారా? లేదా? అనడానికి టెక్నికల్ గా ఆధారాలు ఉన్నాయా లేదా అనే మీమాంసతో చర్య తీసుకోలేదు అని బుకాయించడానికి ఒక ఆస్కారం ఉండేది. ఇప్పుడు పదో షెడ్యూలు వివరాలు రావుల చెబుతున్నట్లుగా పార్టీ విలీనానికే తప్ప శాసనసభాపక్షం విలీనానికి సంబంధం లేని వ్యవహారం అయితే గనుక.. ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇరుకున పడ్డట్లే. వారు తాము తెరాసలో చేరినట్లుగా స్పీకరుకు ఇచ్చిన లేఖే.. వారికి మరణశాసనం అయ్యే ప్రమాదం ఉంది.
మరోవైపు ఇలా మూడింట రెండు వంతులు ఉన్నంత మాత్రాన శాసనసభా పక్షం విలీనం అనేది చట్టం, రాజ్యాంగం ప్రకారం కుదరదు అంటూ రవిశంకర్ వంటి న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ రకంగా చూసినా.. వారికి చిక్కులు తప్పకపోవచ్చు. ముందు ముందు ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.