పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఇక ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. అదేమిటంటే సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టడం. తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లుగా మీడియాలో రాశానని వాదిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులపై ఇరవై ఐదో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటి ప్రకారం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ న్యాయనిపుణుల బృందం ఇచ్చిన సలహా మేరకు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశామని అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇదే పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ వాదనను ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ.. దానం నాగేందర్ మాత్రం ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేరు. ఆయన కాంగ్రెస్ లో చేరడమే కాదు ఆయన ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. అందుకే పార్టీ మారలేదని వాదించలేరు.
సుప్రీంకోర్టు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అంటోంది. పదవి కాలం అయిపోయే వరకూ వేచి చూడటం కరెక్ట్ కాదని అంటోంది. సరైన సమయం అంటే ఎంతో చెప్పాలని నిలదీస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేకుండా అసలు తాము పార్టీ మారలేదని అంటున్నారు. పార్టీ మారారన్నదానికి బీఆర్ఎస్ వద్ద కండువా కప్పించుకున్న ఫోటోలు తప్ప ఏమీ లేవు. చట్టం ప్రకారం.. విప్ ఉల్లంఘించినప్పుడు మాత్రమే అనర్హతా వేటుకు అవకాశం ఉంటుంది.