ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటం, ఇప్పుడు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య పోరాట స్థాయికి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో తెదేపా ఎమ్మెల్యే అనిత పావుగా మారిందని, అందుకు ఆమెపై తనకు చాలా జాలి కలుగుతోందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్న మాటలను అనిత తిప్పికొట్టారు. “నేను ఎవరి చేతిలో పావుగా మారలేదు. రోజమ్మా…నువ్వే జగన్ చేతిలో పావుగా మారావనే సంగతి తెలుసుకో. నాపై మీరు సానుభూతి చూపనక్కర లేదు. మీ మీద మీరే సానుభూతి చూపించుకోండి. శాసనసభలో మీరు నన్ను దూషించినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం అని సవాలు విసిరారు కదా…రాజీనామా పత్రం వ్రాసి సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు నన్ను దూషించినట్లు నిరూపించబోతున్నాను. అందుకు నా దగ్గర బలమయిన ఆధారాలున్నాయి,” అని అనిత రోజాకి సవాలు విసిరారు.
అయితే వారి సవాళ్ళు, ప్రతి సవాళ్లు అన్నీ తమ పార్టీ అధినేతలను మెప్పించడానికి, వీలయితే ప్రజలను ఆకట్టుకొని కాలక్షేపం కోసమేనని అందరికీ తెలుసు. వారిరువురి వాదోపవాదాలు విన్న తరువాత ఒక విషయం స్పష్టమవుతోంది. ఆ రెండు పార్టీల అధినేతలు ఆడుకొంటున్న రాజకీయ చదరంగంలో ఆ మహిళా ఎమ్మెల్యేలిద్దరినీ పావులుగా వాడుకొంటున్నారని స్పష్టం అవుతోంది. మహిళా ఎమ్మెల్యే అయిన రోజాకి మహిళా ఎమ్మెల్యేతోనే చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అనితను తెదేపా ఉపయోగించుకొంటుంటే, తన బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు, తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచేందుకే జగన్మోహన్ రెడ్డి రోజాను ఉపయోగించుకొంటున్నారని చెప్పక తప్పదు.
అయితే అనిత ప్రస్తుతం అధికార పార్టీలో ఉంది కనుక ఈ ఏమ్మోషనల్ డ్రామాను ఇంకా రక్తి కట్టించి వైకాపాను, రోజాను ఇరుకున పెట్టగలిగితే, వైకాపా చెపుతున్నట్లుగా ఆమెకు ఏ మంత్రి పదవో దక్కవచ్చును. కానీ, వైకాపా ప్రతిపక్షంలో ఉంది కనుక రోజాకి కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండబోదు…ప్రజల జాలి, సానుభూతి తప్ప. టీవి, సినీ, రాజకీయ రంగాలలో అంత గొప్ప పేరున్న రోజా, జగన్ మాటను కాదనలేక శాసనసభ బయట రోడ్డు పక్కన ఫుట్ పాత్ పడుకొనడం చూసి ప్రజలందరూ నవ్వుకొంటున్నారు…ఆమె పరిస్థితి చూసి జాలి పడుతున్నారు కూడా. కనుక అనిత చెప్పినట్లుగా రోజా తనపై తనే సానుభూతి చూపించుకోవలసి ఉంటుంది.