కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకునేది లేదని కేసీఆర్ చెబుతున్నారు. మంచిర్యాల బహిరంగసభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు తాను గెలిచినా టీఆర్ఎస్ లోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటూ… తమ పార్టీ ఓట్లు కూడా ఆయనకే వేయమని అడుగుతున్నారని .. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయననే కాదు కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్లెవరినీ చేర్చుకునేది లేదని చెబుతున్నారు.
ఎన్నికల తరవాత కాంగ్రెస్ నేతల్ని చేర్చుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే చేరేందుకు ఎవరూ వెళ్లరు. కానీ గెలిస్తే కాంగ్రెస్ ను తుడిచి పెట్టడానికి ఎమ్మెల్యేలను ఆకర్షించకుండా ఉండరు. లందుకంటే గత రెండు సార్లు అదే జరిగింది. కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్లలో ఒకరిద్దర్ని తప్ప అందర్నీ పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు కేటాయించారు. ఈ సారి కాంగ్రెస్ గెలిచినా అదే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ ఓడిపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుని.. కేసీఆర్ చూపించిన బాటలో నడిచేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో సందేహం ఉండదు.
కానీ ఇప్పుడు బీఆర్ఎస్లోనే చేరుతామని ఆ పార్టీ ఓటర్లను ముందుకానే కాంగ్రెస్ కు ఓటేసేలా చేసుకునే ప్రయత్నాలను కొంత మంది చేయడం ఆ పార్టీకి ఇబ్బందికరంగానే మారింది. కాంగ్రెస్ మెజార్టీ వస్తే ఒక్కరూ ఆ పార్టీని వీడరు. ఇలా అందరూ బీఆర్ఎస్ లో చేరే వారే కదా అని తమ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ కంగారు పడుతున్నారు. అందుకే నేరుగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ ఇది ప్రజల్లోకి నెగెటివ్ గా వెళ్తే మాత్రం ఇబ్బందే.