తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడుతున్న నెయ్యి కల్తీ అయ్యిందన్న వార్తలతో… తీవ్రంగా స్పందించి, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్ధతు పెరుగుతోంది. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా హిందూ ధర్మ పరిరక్షణకు పూనుకున్నారని పలువురు అభినందిస్తున్నారు.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ఎమ్మెల్సీ, కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేత దేశపతి శ్రీనివాస్ కాస్త వెటకారంగా స్పందించారు. స్వతహాగా కవి కూడా అయిన దేశపతి… పవన్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
చెగువేరాతో మొదలుపెట్టాడు… తెలంగాణ రైతాంగ పోరాటం చదివానన్నాడు… గద్దర్ అంటే ఇష్టమన్నాడు… గురజాడ, శేషేంద్రల కవితలు కోట్ చేసి… ఇప్పుడు సనాతన ధర్మం, ప్రాయశ్చిత్త దీక్షలు అంటున్నాడు. ఎందో ఈ అయోమయం అంటూ పోస్టు చేశారు.
నేరుగా పవన్ పేరును ప్రస్తావించకపోయినా… ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ పెట్టిందేనని స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే, ఇది వ్యక్తిగతమా… బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా ఇదేనా… అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో వైసీపీకి, జగన్ కు బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు అంటే పడదు అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పవన్ పై చేసిన పోస్టు చర్చనీయాంశం అవుతుండగా, ఓ కామెంట్ కు బదులిస్తూ… ఆయన కమ్యూనిలిజాన్ని, కమ్యూనిజాన్ని ఏకకాలంలో మాట్లాడుతున్నాడు. అదీ అయోమయవ్యవస్థ అంటూ చెప్పుకొచ్చారు.