ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల నమోదు ప్రారంభించారు.
ఈ నెల 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యూయేట్ , టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎప్పటికప్పుడు కొత్త ఓటర్ల లిస్ట్ రెడీ చేసుకుంటారు. పాత ఓటర్ల లిస్ట్ పని చేయదు. కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరలా కొత్తగా ఓటు హక్కును పొందాలి. ఆన్లైన్ లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
ఓటరు నమోదకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొవిజినల్ ,ఫొటో ఆధార్, ఓటర్ ఐడీని సమర్పించాల్సి ఉంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఫారమ్ 18, 19 ద్వారా ఓటరుగా నమోదు కావాలని అధికారులు కోరుతున్నారు. గతంలో మూడు గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది మార్చిలో పోలింగ్ జరుగుతుంది.