తెలంగాణ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారుతోంది. రెండు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. మీడియా కూడా వీరు తప్ప ఎవరూ పోటీలో లేరన్నట్లుగా కవరేజీ ఇస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతే జరిగింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోందన్న అభిప్రాయం ఓటర్లలో కల్పించి.. వారి మధ్యనే ఓటర్లకు చాయిస్ ఉండేలా చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రముఖులే నిలబడ్డారు. రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో పోటీలో ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరాంతో పాటు పలువురు ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. వీరెవరికి మీడియాలో చోటు కనిపించడం లేదు.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో మాదిరిగానే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా.. చివరికి వచ్చే సరికి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల నేతలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజల కష్టాలకు కారణం మీరంటే.. మీరని నిందలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యూయేట్ స్థానం నుంచి నిలబెట్టిన పీవీ కుమార్తెను గెలిపించడానికి శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాన్సివ్వకుండా రెండు పార్టీలే హోరాహోరీ తలపడుతున్నట్లుగా ఓటర్లకు అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నం. బయట రెండు పార్టీల నేతలు నువ్వా.. నేనా అన్నట్లుగా పోరాడుకున్నా… గ్రాడ్యూయేట్ ఓటర్ల తీర్పు మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే బరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఉన్నారు. అయితే… తెలంగాణలో రాజకీయం మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతుందనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఓటర్లు చైతన్యం చూపి రాజకీయ ప్రచారంలో పడకపోతే… తేడా కనిపించడం ఖాయమని చెప్పుకోవచ్చు.