తెలంగాణాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా వాటిలో 6 స్థానాలలో తెరాస అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండ-1, ఖమ్మం-1, మహబూబ్ నగర్-2, రంగారెడ్డి జిల్లాలో-2 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడవుతాయి. ఈ ఆరు స్థానాలలో మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. రెండు మూడు గంటల్లోనే ఫలితాలు వెల్లడి అవవచ్చును.
ఈ ఎన్నికల ఫలితాలను నోట (నన్ ఆఫ్ ద ఎబవ్) తో సహా ప్రాధాన్యత క్రమంలో లెక్కించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఆరు స్థానాలలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో తెరాస, కాంగ్రెస్ పార్టీ, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. కనుక అక్కడ ఫలితాలపై అందరిలో చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఖమ్మంలో పోటీ ప్రధానంగా తెరాస, సీపీఐ పార్టీల మద్యే జరిగింది. అక్కడ సీపీఐ అభ్యర్ధికి తెదేపా మద్దతు తెలిపింది. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిలబడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెల్పు ఖాయమని ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.