అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కన్నా గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ విషయంపైనే అధికార యంత్రాంగం ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఆలోచనల మేరకే అధికారులు నడుచుకుంటున్నారు. మార్చి రెండు, మూడు తేదీలలో విశాఖలో ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నెలాఖరులో జీ 20 సన్నాహక సమ్మిట్ ఉంది. ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. సాధారణంగా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయవు. కానీ అధికారుల్ని నమ్ముకుని వైసీపీ ముందుకు వెళ్తోంది. టీచర్లను బెదిరించి అయినా సరే ఓట్లు వేయించుకోగలమనే నమ్మకంతో అభ్యర్థుల్ని నిలిపింది. దానికి తగ్గట్లుగానే ప్రవీణ్ ప్రకాష్ దగ్గర్నుంచి అధికారులంతా ఫీల్డ్ లోనే ఉన్నారు. తాము చేయగలిగింది చేస్తున్నారు.
ఇక గ్రాడ్యూయేట్ పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా తాము చేయాలనుకున్నది చేస్తున్నారు. ఎలాగైనా గెలవలాన్న పట్టుదల ప్రభుత్వంలో ఉంది. అందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఈ ఏడాదిపెట్టేదే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ … ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. అయినా బడ్జెట్లో పెట్టడానికి ఏమీ ఉంటుందని… ఏ నెలకానెల అప్పులు తెచ్చుకుని అవసరమైన మేరకు సర్దుబాటు చేసుకోవడం తప్ప… ప్రణాళిక పరమైన ఖర్చులేమీ ఉండవు కదా అన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారికంగా ఎలాంటి సదస్సులు ఏర్పాటు చేయకపోయినా ఫిబ్రవరిలోనే సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ను ఆమోదించుకున్నారు. ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వానికి పెద్దగా పనులు లేకపోయినా ఎన్నికల సన్నాహాల కోసమే… అసెంబ్లీ నిర్వహణ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. చివరికి గతంలోలనే బడ్జెట్ ను అడ్ హాక్ గా గవర్నర్ తో ఆమోదింప చేసుకుని… తర్వాత తీరికగా సమావేశాలు నిర్వహిస్తారా లేకపోతే… రెండు, మూడు రోజుల్లో మమ అనిపిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.