హూజరాబాద్ నుంచి టిక్కెట్ రేసు నుంచి సీఎం కేసీఆర్ ఒకర్ని ఎలిమినేట్ చేశారు. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే పాడి కౌశిక్ రెడ్డిని రేసు నుంచి తప్పించారు. ఆయనకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అవుతారు. నిన్నామొన్నటి వరకూ కాంగ్రెస్ నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి … టీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని చెప్పుకోవడం ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటున్న ఆడియో ఒకటి వెలుగులోకి రావడం సంచనలం అయింది. కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో.. ఆయనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఆ తర్వాత అధికారికంగా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరే సమయంలోనే… పాడి కౌశిక్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అప్పుడే.. ఆయనకు హుజూరాబాద్ టిక్కెట్ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వర్గాలకు అర్థమయింది. అయితే.. తాను పోటీచేయాలనుకుంటున్నాని.. ఎలాగైనా అవకాశం ఇవ్వాలని ఆయన లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే ఆయనకు టిక్కెట్ ఇచ్చే చాన్సే లేదని అనుకున్న టీఆర్ఎస్ హైకమాండ్.. ఆయనకు ఆశలు పెంచకుండా ముందుగానే ఎమ్మెల్సీ ప్రకటించేసినట్లుగా తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలా మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో ఎవరికీ పదవులు ఇవ్వలేదు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా పార్టీలో చేరారు. ఆయన కూడా అభ్యర్థి లేకపోతే ఎమ్మెల్సీ అనే ప్రచారం జరిగింది. వీరందర్నీ కాదని.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రకటించడం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి… గెలుపొందాలని అనుకున్న కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ నిర్ణయం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఏదో ఓ పదవి అనుకుని ఆయన సంతృప్తి పడాల్సిందే. పాడి కౌశిక్ రెడ్డి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు.