మార్చిలో నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అవుతారని ఆ తర్వాత మంత్రిగా ప్రమాణం చేస్తారని పవన్ కల్యాణ్ చెప్పారు. నిజానికి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా లేకపోయినా మంత్రిగా ప్రమాణం చేయవచ్చు. అలా ప్రమాణం చేసిన ఆరు నెలల్లో ఏదో ఓ సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నది రాజ్యాంగంలోని రూల్. ఈ ప్రకారం ఇప్పుడే ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేయవచ్చు. కానీ పవన్ కల్యాణ్ అంత తొందర అవసరం లేదని ఎమ్మెల్సీగా ఎన్నికయిన తర్వాతనే ప్రమాణం చేయిద్దామని సూచించినట్లుగా తెలుస్తోంది.
మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో మూడు టీడీపీ సభ్యులవి.. అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమలనాయుడు పదవి కాలం ముగిసిపోతుంది. అలాగే వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తవుతుంది. నిజానికి ఆ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు కానీ ఆమోదించలేదు. ఈ నాలుగు సీట్లలో ఒకటి నాగబాబుకు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు. ఈ దిశగా చర్చలు పూర్తయ్యాయి కాబట్టే పవన్ కల్యాణ్ ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి ఇచ్చారు. నాగేంద్రబాబు త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి ఖాళీ అయ్యే సీట్లలో ఎమ్మెల్సీగా బీజేపీ వారికి అవకాశం ఇచ్చే చాన్స్ లేదని అనుకోవచ్చు. అయితే గవర్నర్ కోటాలో ఓ స్థానం ఖాళీ అవుతుంది. దాన్ని బిజేపీ అడిగే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ కి మూడు సీట్లు ఖరారు కానున్నాయి. మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి.