ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..? బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు చేస్తోన్న ప్రయత్నాలేవి ఇప్పటికప్పుడు ఫలించే అవకాశాలు లేవా ..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మూడు నెలలకు పైగా జైల్లోనే మగ్గుతున్న కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని ఆమె సన్నిహిత నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని బీఆర్ఎస్ గెలుపొందిన స్థానాల్లోని బాల్కొండను మినహాయిస్తే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు కవితకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు. వీరిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా బీఆర్ఎస్ ను వీడటం చర్చనీయాంశం అవుతోంది.
కవిత కోటరీలో కీలకంగా ఉన్న సంజయ్ కుమార్ ఆమె అరెస్ట్ అయిన నాటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం విమర్శలకు తావిచ్చినా…ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.? అనేది అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే, నిజమాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం తగ్గడం ఓ కారణమైతే, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ఇప్పట్లో బయటకు రాదనే అంచనాతోనే సంజయ్ కుమార్ పార్టీ మారారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, గతంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు వేసవి సెలవులు ముగియగానే జులైలో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును వెలువరించనుంది.