వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. చిలుకలూరిపేట ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీని వీడాలని సంక్రాంతి సందర్భంగా నిర్ణయించుకున్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. విడదల రజనీకి మళ్లీ చిలుకలూరిపేట ఇంచార్జ్ గా బాధ్యతలు ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. తన అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోని హైకమాండ్ కోసం ఇక పని చేయాల్సిన అవసరం లేదని… ఎంత అవమానించినా పార్టీలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు.
జగన్ కాంగ్రెస్ ను వదిలి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనతో నడిచినవారిలో మర్రి రాజశేఖర్ ఒకరు చిలుకలూరిపేట నుంచి ఓ సారి పోటీ చేసి ఓడిపోయాక.. డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పార్టీని బతికించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు విడదల రజనీని టీడీపీ నుంచి తెచ్చుకుని టిక్కెట్ ఇచ్చారు. ఆమెను గెలిపిస్తే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ జనం ముందు హామీ ఇచ్చారు. మంత్రి పదవి కాదు కదా.. నియోజకవర్గంలో నిలువ నీడ లేకుండా చేశారు. జగన్ ఇంత మోసగాడా అని ఓ సారి మర్రి రాజశేఖర్ పార్టీ వీడెందుకు సిద్దమైతే.. ఎమ్మెల్సీ హామీ ఇచ్చి బుజ్జగించారు . చివరికి ఇచ్చారు.కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్దతిలో ఆయనకు టార్చర్ చూపిస్తున్నారు.
విడదల రజనీపై చిలుకలూరిపేటలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమెను గుంటూరుకు పంపారు. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దాన్ని ప్రజల నుంచి పిండుకునే విషయంలో రజనీ రాటుదేలిపోయారు. ఐదేళ్ల పాటు చిలుకలూరిపేట నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేయడంతో ప్రజలు కూడా భరించే పరిస్థితుల్లో లేరు. అందుకే మర్రి రాజశేఖర్ వైసీపీలో ఉండటం కన్నా తన దారి తాను చూసుకోవడం మంచిదని అనుకుంటున్నారు. రేపోమాపో వైసీపీకి రాజీనామా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.