వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు రాము కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. 57 ఏళ్ల రామును కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 30 ఏళ్ల క్రితం రాములు పీపుల్స్ వార్ పార్టీలో పని చేశారు. 1991లో పోలీసులకు లొంగిపోయాడు. స్వగ్రామంలో ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన…10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రైల్వే స్టేషన్ లో నిద్రించిన సమయంలో.. దుండగులు బండరాయితో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోతుల సునీత భర్త పోతుల సురేష్.. పరిటాల రవికి అత్యంత సన్నిహితులు. ఆయన కీలక అనుచరుల్లో ఒకరు. పరిటాల రవి హత్య తర్వాత చాలా కాలంగా ఆజ్ఞాతంలో ఉన్నారు. చివరికి వైఎస్ హ త్య తర్వాత రోశయ్య సీఎం అయిన తర్వాతనే ఆయన ఆజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. కేసుల నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన భార్య పోతుల సునీతకు టీడీపీలో ప్రాధాన్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కు చెందిన సునీతకు చీరాలలో బాధ్యతలు ఇచ్చారు. ఓ సారి టిక్కెట్ ఇచ్చినా ఓడిపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. చంద్రబాబుతో పాటు ఇతర కుటుంబసభ్యులపై బూతులు కూడా తిట్టారు. ఆమెపై నారా లోకేష్ ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. ఆమె సోదరుడి హత్యతో రాజకీయాలకు సంబంధం ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పోలీసులు ఇంకా ఏ వివరాలు ప్రకటించలేదు.