ఏపీలో ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి పోలింగ్ ఇరవై ఏడో తేదీన ముగుస్తుంది. ఆ తర్వాత ఫలితాలు వస్తాయి. వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజానికి కూటమి అభ్యర్థుల్ని ఎంచుకోవడమే సమస్య. గెలుపు కాదు.
ఐదు ఎమ్మెల్సీ స్థానాలూ కూటమి ఖాతాలోకే !
అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఐదు ఎమ్మెల్సీ స్థానాలూ కూటమి ఖాతాలో పడనున్నాయి. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్సీలు అవుతారు. ఈ లెక్కన చూసుకుంటే.. ఒక్కో సభ్యుడిగా 35 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. వైసీపీకి ఉన్నది పదకొండు మంది సభ్యులు కాబట్టి పోటీ చేయడం కూడా కష్టమే. పోటీ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారో లేదో తెలియదు. అందుకే పోటీ ఆలోచన వైసీపీ చేసే అవకాశం లేదు. చేస్తే పరువు పోతుంది.
జనసేన నుంచి నాగబాబుకు చాన్స్ !
ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి పార్టీ అయిన జనసేనకు ఒకటి కేటాయించబోతున్నారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని గతంలోనే ప్రకటించారు. అందుకే ఓ బెర్త్ ఆయనకు ఖరారు అయిపోయింది. పదవి కాలం ముగుస్తున్న వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. వారిలో యనమల, పడుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, జంగాకృష్ణమూర్తి వంటి వారు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. పిఠాపురం వర్మ, దేవినేని ఉమ కూడా అవకాశం కోసం చూస్తున్నారు.
బీజేపీకి చాన్స్ లేనట్లే !
భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించడం అసాధ్యంగా కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లను కేటాయిస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే చాన్స్ లేదు. అయితే ఆ పార్టీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు బీజేపీ కోసమేనని చెబుతున్నారు కాబట్టి.. చాన్స్ లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఐదేళ్లలో వైసీపీకి ఒక్క పోస్టూ రాదు !
వచ్చే ఐదేళ్లలో వైసీపీకి ఓ ఎమ్మెల్సీ కానీ.. ఓ రాజ్యసభ కానీ వచ్చే అవకాశం లేదు. అతి స్వల్ప సీట్లకు పరిమితం అవడమే కారణం. వచ్చే రెండు, మూడేళ్లలో మండలిలో కూడా ఒకటి, రెండు స్థానాలకు పడిపోతుంది.