తెలంగాణలో ఈ సారి ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులన్నీ నల్లగొండ జిల్లాకే దక్కుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు.. అన్ని పార్టీలు నల్లగొండ నేతలకే చాన్స్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిత్వం దక్కించుకున్న అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఇద్దరూ నల్లగొండ జిల్లా నేతలే. సీపీఐ అభ్యర్థిగా ఖరారైన నెల్లికంటి సత్యం కూడా నల్లగొండ జిల్లా నేతనే. బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఖరారు చేసిన దాసోజు శ్రవణ్ కూడా నల్లగొండ జిల్లాకు చెందిన లీడర్.
మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు సీట్లు నల్లగొండ జిల్లా నేతలకు ఖరారయ్యాయి. విజయశాంతి స్వస్థలం ఎక్కడ అన్నదానిపై క్లారిటీ లేదు. ఒసేయ్ ..రాములమ్మ సినిమా తర్వాత ఆమె వచ్చిన క్రేజ్, తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ తో పార్టీ పెట్టారు. తన సొంత ఊరు ఏటూరు నాగారం దగ్గర రామన్న గూడెం అని చెప్పుకున్నారు. ఆమె అలా చెప్పుకున్నారు కానీ.. ఆమె స్వస్థలం ఏదో స్పష్టత లేదు. విజయశాంతి బంధువులు కొంత మంది గోదావరి జిల్లాల్లో ఉన్నారని చెబుతారు. విజయశాంతి స్వస్థలం ఏది అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో వేరే జిల్లాకు పదవి కేటాయించారని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.
రాజకీయ పార్టీలు ప్రాంత, సామాజిక న్యాయం పాటించడం అనేది సహజంగా చేసే ప్రక్రియ. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ .. వ్యక్తుల సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుంది. అందుకే వారు ఏ జిల్లాలకు చెందిన వారనేది చూసుకోలేదు. తీరా అభ్యర్థుల్ని ఖరారు చేసేసరికి అంతా నల్లగొండ జిల్లా వారే ఉన్నారు. దీని వల్ల ప్రాంత సమానత్వం దెబ్బతిన్నదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.