తాజాగా జరిగిన రెండు రాష్ట్రాలలో సాధించిన విజయం నేపధ్యంలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆ విజయాలు రెండూ మనకు చాలా దూరంగా ఉన్న రాష్ట్రాలు కాబట్టి అక్కడి భాజాపా నేతలూ, ప్రతిపక్ష పార్టీ నేతలూ ఆ పని చేస్తున్నారేమోలే అనుకుంటున్నారా… అయితే తప్పులో కాలేసినట్టే.
ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. ఎక్కడో గెలుపు వస్తే మరెక్కడో గొడవ పుడుతుంది అన్నట్టుగా… గుజరాత్, హిమాచల్లో గెలుపు పుణ్యమాని ఆంధ్రప్రదేశ్లో భాజాపా, తేదాపా పార్టీలు వాగ్వివాదాలకు దిగడం విశేషం. నిజానికి ఈ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో భాజాపాకు పెద్దగా ఒరిగేదేం లేదు. అయితే అసలే భాజాపాతో సంబంధాల పట్ల అభథ్రతా భావంతో ఉన్న తేదేపాకు మాత్రం ఇది కాస్త పుండు మీద కారం పూసుకున్న చందమే అనడంలో సందేహం లేదు.
ఈ నేపధ్యంలో తమ గెలుపుపై స్పందించిన భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇదే స్ఫూర్తిని తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగిస్తామన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం అవుతామని, ఎవరినీ సీట్లు అడుక్కునే స్థితిలో కాక డిమాండ్ చేసే స్థితిలో ఉండబోతున్నామంటూ అతి విశ్వసాన్ని ప్రదర్శించారు. అయితే తాము తేదేపాతో ఇప్పటకీ మిత్రపక్షమే నంటూ ఫైనల్ టచ్ ఇచ్చారు. దీనికి బదులిచ్చిన తేదేపా నేత బాబూ రాజేంద్రప్రసాద్… సోము వీర్రాజు పగటి కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ రెండు ఎంపిలు, నాలుగు ఎమ్మెల్యేలు గెలిచిందంటే అది తమ పుణ్యమేనన్నారు. ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్న సోము వీర్రాజు పై ఆ పార్టీ అథిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వెంటనే దీనికి సోము వీర్రాజు మళ్లీ స్పందించారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యల్ని చంద్రబాబు కూడా సమర్ధిస్తే తమ పార్టీల మధ్య పొత్తును సమీక్షించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ పోకడ చూస్తుంటే… గుజరాత్ గెలుపు ఫలితంగా పుట్టే ప్రతిధ్వనులు ఆ రాష్ట్రంలో, ఢిల్లీలో కన్నా ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.