మాజీ సీఎం కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలేలా కనపడుతోంది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీగా ఉన్న సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కస్టడీలో ఉన్న ఐఎస్ బీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు చెప్పిన విషయాలతో త్వరలోనే వెంకట్రామిరెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతున్నట్లు తెలుస్తోంది.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం వెంకట్రామిరెడ్డి నుండి డబ్బులు సరఫరా చేశారు. అందుకు ఓ ఎస్సైని ఎస్కార్ట్ గా పెట్టుకోవటం సంచలనంగా మారింది. ఎన్నికల అధికారులకు అనుమానం రాకుండా పదుల సార్లు కోట్లాది రూపాయలు స్పెషల్ వెహికల్ లో ట్రాన్స్ ఫర్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.
తెల్లాపూర్ లోని రాజ్ పుష్ప గ్రీన్ డేల్ విల్లాస్ లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో చరణ్ ను కలవాలని ఎస్సైని రాధాకిషన్ రావు ఆదేశించగా, చరణ్ ఓ ఐఫోన్ తో పాటు సిమ్ కార్డు ప్రోవైడ్ చేశారు. ఆ నెంబర్ తోనే రాధాకిషన్ రావు, సదరు ఎస్సై మాట్లాడుకునే వారు. రాధాకిషన్ రావు సూచనతో వారికి అత్యంత ఆప్తుల ఆసుపత్రిలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావును ఎస్సై కలిశారు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్సై రాణిగంజ్ కు వెళ్లి కోటి రూపాయలు తెచ్చి ఆ ఆసుపత్రిలోనే రిటైర్డ్ ఎస్పీకి అందించారు. అక్కడి నుండి రిటైర్డ్ ఎస్పీ పంపిన వ్యక్తితో కలిసి ఎస్సై అప్జల్ గంజ్ వెళ్లి అక్కడ కోటి తీసుకొని మలక్ పేట్ లోని ఆసుపత్రిలో అందించారు. ఇదంతా హవాలా డబ్బుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే, ఈ మొత్తం డబ్బు సరఫరాలో ఎస్సైకి అనుమానం వచ్చినా పై అధికారులు చెప్పటంతో అడ్డుచెప్పలేకపోయారు. తనకు ఎవరి డబ్బు అనేది కూడా పూర్తిగా తెలియదని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక అసలు నిజం తెలుసుకున్నట్లు సమాచారం.
అయితే, వెంకట్రామిరెడ్డి తన చిన్ననాటి స్నేహితుడు కావటంతోనే ఆయన డబ్బును సరఫరా చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది.