వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తన సిఫారసు లేఖలో టీటీడీ శ్రీవారి వీఐపీ దర్శన టిక్కెట్లను అమ్ముకున్న వైనం వెలుగులోకి వచ్చింది . ఓ భక్తుడు ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఆరు టిక్కెట్లను అరవై ఐదు వేలకు అమ్ముకున్నారు. కేసు నమోదు కావడంతో ఆ ఎమ్మెల్సీ తమ పార్టీకి చెందిన వారు కాదని బొత్స సత్యనారాయణ ప్లేట్ ఫిరాయించేశారు.
ఆ ఎమ్మెల్సీ మైనార్టీ వర్గానికి చెందిన మహిళ. అన్నమయ్య జిల్లాకు చెందిన జకియా ఖానమ్ ఇలా టిక్కెట్లు అమ్ముతూ దొరికిపోయారు. దీంతో వెంటనే వైసీపీ నేత బొత్స తెరపైకి వచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న ఆమె టీడీపీలోకి వెళ్లారని.. వైసీపీ నేత కాదని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె ఓ సారి లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ టీడీపీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కడప నేతలు వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఆమె టీడీపీలో చేరిపోయిందని బొత్స చెబుతున్నారు. నిజానికి అలా చేరితే వెంటనే తమ పార్టీకి చెందిన శాసనమండలి చైర్మన్ తో అనర్హతా వేటు వేయించేసేవారు. పార్టీ మారకపోయినా జంగా కృష్ణమూర్తితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలపై అలాగే అనర్హత వేటు వేయించారు. పార్టీ మారితే ఊరుకునేవారా ?. ఇంకా విశేషం ఏమిటంటే.. మీరు వద్దు.. మీ పార్టీ వద్దు అని రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలను కూడా ఆమోదించకుండా వారు మళ్లీ వెనక్కి వస్తారని ఎదురు చూస్తున్నారు వైసీపీ నేతలు.