తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీల టెన్షన్ తప్పడం లేదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయాలనుకుంటే గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్‌తో పాటు కుర్రా సత్యనారాయణ అనే బీజేపీ వలస నేతను ఎమ్మెల్సీలను చేద్దామనకున్నా..గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇతర కోటా ఎమ్మెల్సీల సంగతి అయితే ఎలాగోలా చూసుకోవచ్చు కానీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో మాత్రం గవర్నర్ ఆమోదం తప్పని సరి. దీంతో తమిళి సై అంత సామాన్యంగా ఓకే చేయడం లేదు. సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే.. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని , మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం ఉంది. రాజకీయ నేతలకు అవకాశం కల్పించరు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి క్రీడలకు సేవ చేశారన్న కారణం చూపి నామినేట్ చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. దాంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి… మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో చాన్సిచ్చారు. ఆయన పేరును గవర్నర్ వెంటనే ఆమోదించారు. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే అందరికీ పరిచయం. అలాగే కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం లేదని చెబుతున్నారు. నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవి కాలం ఎప్పుడో పూర్తయింది. కొంత కాలం ఎవర్నీ నియమించకుండా కేసీఆర్ ఆలస్యం చేస్తే..ఇప్పుడు గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. గవర్నర్ ను గట్టిగా విమర్శించలేని స్థితి బీఆర్ఎస్ది. ఎందుకంటే వారి పేర్లను తిరస్కరిస్తే .. ప్రభుత్వం చేయగలిగేదేమీ ఉండదు. మరోసారి సిఫార్సు చేసుకోవాల్సి ఉంటుంది.