అప్పుడెప్పుడో ఓసారి రిటైర్మెంట్ గురించి సీరియస్‌గా ట్వీట్ చేశాడు కీరవాణి. ఫలానా సంవత్సరం నుంచి నేను సినిమాలు మానేస్తున్నా.. అంటూ హింట్ ఇచ్చాడు. `బాహుబలి 1` తరవాతే…కీరవాణి సినిమాలకు దూరం అయిపోతాడనుకున్నారు. కానీ… అది `బాహుబలి 2` తరవాత కూడా కొనసాగింది. ప్రస్తుతానికైతే కీరవాణి రిటైర్మెంట్ అనే ఆలోచననే దగ్గరకు రానివ్వడం లేదు. వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. ఏదో ఓ వ్యాపకంలో బిజీగానే ఉంటున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా రాజమౌళితో… తన ప్రయాణం కొనసాగుతోంది.
రిటైర్మెంట్పై అప్పట్లో ఓ ప్రకటన చేశారు కదా అని అడిగితే తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. తను సగం రిటైర్ అయిపోయినట్టే అంటూ లాజికల్‌గా మాట్లాడుతున్నాడు. ఇది వరకు హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇలా అందరి సమ్మతితో నడుచుకునేవాడినని, ఆఖరికి నిర్మాత మనవరాలు చెప్పినట్టు కూడా వినాల్సివచ్చేదని, ఇప్పుడు అలా కాదని వీళ్లలో ఒక్కరి మాటే వింటున్నానని, అలా…సగం రిటైర్ అయినట్టే అంటూ చమత్కరించాడు. కీరవాణి రిటైర్ కావాలని ఎవరూ కోరుకోలేదు. ఇప్పటికీ మంచి సంగీతం అందించే సత్తా ఆయనకు ఉంది. ఆయనే రిటైర్మెంట్ మాట ఎత్తారు. అంతలోనే మాట మార్చారు. మరి తన అభిప్రాయం మార్చుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఆయనకే తెలియాలి.