కీరవాణి స్వతహాగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఆయన సైతం జగన్ పాలనపై గత ప్రభుత్వ పనితీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. ఈరోజు జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో ఈ పరిణామం చోటు చేసుకొంది. రామోజీరావుని గుర్తుకొనే సందర్భంలో కీరవాణి.. ”బతికితే రామోజీరావులా బతకాలని ఓ సభలో అన్నాను. మరణించినా ఆయనలానే మరణించాలి అని ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే.. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. తన మరణాన్ని, తన మృత్యువునీ ఆపి ఉత్తరాయణం వచ్చేంత వరకూ వాయిదా వేశారు. అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్రదేశ్ కబంద హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్లారా చూసి, అప్పుడు నిష్క్రమించారు. అందుకే మరణించినా ఆయనలా మరణించాలి” అంటూ పరోక్షంగా జగన్ సర్కారుపై తన నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కీరవాణి చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ఇదే సభలో రాజమౌళి రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలని మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, దేశం కోసం రామోజీరావు ఎంతో చేశారని, ఆయనకు ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని రాజమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.