హైదరాబాద్: మొబైల్ యాప్‌లు జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాయి… దైనందిన జీవితంలో ఎన్నోరకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఒక యాప్ ఇటీవల జరిగిన ఒక దేశాధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పి సంచలనం సృష్టించింది.
శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికలలో అధికార పార్టీకి చెందిన మహీంద్ర రాజపక్సను యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ పార్టీకి చెందిన మైత్రీపాల సిరిసేన ఓడించి అధ్యక్షపదవిని చేపట్టారు. ఈ విజయానికి ప్రధానకారణం ఒక మొబైల్ యాప్ అని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ పార్టీ నాయకురాలు, శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ చెప్పారు. బీహార్‌లోని బోధ్‌గయలో జరుగుతున్న హిందూ-బుద్ధిస్ట్ సదస్సుకు హాజరవటనికి చంద్రిక కుమారతుంగ ఇటీవల ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘వైబర్’ సహాయం వలనే తమపార్టీ అభ్యర్థి సిరిసేన – రాజపక్సను ఓడించగలిగారని చెప్పారు. అధ్యక్ష పదవిలో ఉన్న రాజపక్స ప్రతిపక్షాల ప్రతి కదలికనూ తెలుసుకుంటూ పై ఎత్తులు వేసేవారని చెప్పారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తుండటంతో తామంతా ‘వైబర్’ యాప్‌ను వాడాలని, సాధారణ ఫోన్లను వాడకూడదని తీర్మానించుకున్నామని తెలిపారు. ఏ ఇంటలిజెన్స్ ఏజెన్సీకూడా ‘వైబర్’ ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయలేదని తాము తెలుసుకునే తాము వాటినే ఉపయోగించామని పేర్కొన్నారు.
మొత్తానికి ఒక మొబైల్ యాప్ ఒక దేశాధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పటం – దైనందిన జీవితాలలో నానాటికీ పెరిగిపోతున్న టెక్నాలజీ చొరబాటును సూచిస్తోంది. ఈ వైబర్ గురించి మన తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు తెలిస్తే ఇక అందరూ ఈ యాప్‌నే వాడటం ప్రారంభిస్తారేమో!