హైదరాబాద్: ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడి డిజిటల్ రివల్యూషన్ కోసం కృషి చేస్తుంటే గుజరాత్లోని ఆయన సొంతజిల్లాలోని ఒక గ్రామంలో అవివాహిత యువతులు మొబైల్ ఫోన్ వాడకూడదంటూ నిషేధం విధించారు. మెహసానా జిల్లాలోని సూరజ్ అనే ఈ గ్రామంలో పెళ్ళికాని అమ్మాయిలు సెల్ ఫోన్ వాడినా, దగ్గర పెట్టుకున్నా రు.2,100 జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి రు.200 బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే ఎవరైనా బంధువులు మాట్లాడాలనుకుంటే తల్లిదండ్రులు అమ్మాయిలకు ఫోన్ ఇవ్వొచ్చంటూ మినహాయింపు ఇచ్చారు.
దీనిపై గ్రామ సర్పంచ్ దేవ్షి వంకర్ మాట్లాడుతూ, అసలు అమ్మాయిలకు సెల్ ఫోన్ ఎందుకని ప్రశ్నించారు. తమలాంటి మధ్యతరగతి ఇళ్ళలో ఇంటర్నెట్ అనేది డబ్బు, కాలం వృథా చేయటానికేనని అన్నారు. ఆడపిల్లలు ఈ సమయాన్ని చదుపుపైనో, ఇతర పనులపైనో ఉపయోగించాలని చెప్పారు. తమ గ్రామంలో అన్ని కులాల్లోనూ కలిపి మొత్తం 2,500 మంది జనాభా ఉన్నారని, అందరూ తమ నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపారు. ఈ నెల 12 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చిందని వెల్లడించారు. ఈ గ్రామానికంటే ముందు గుజరాత్ లోనే బనస్కాంత అనే జిల్లాలోని లూడార్ అనే గ్రామంలో కూడా ఇలాంటి నిషేధాన్ని ప్రవేశపెట్టారు. దేశం ఎటు పోతోంది!