ధూమ్ సినిమాలో బైకుల మీద వచ్చి దోపిడీ చేసెళ్లిపోతారు. కానీ ఇక్కడ అసలైన దొంగలు మాత్రం ఖరీదైన కార్లలో వచ్చి కనీసం కంటికి కూడా కనిపించంకుండా… దోపిడీ చేసుకెళ్లిపోతున్నారు. వారేమీ చైన్ స్నాచింగ్‌లు చేయడం లేదు. ఏకంగా కంటెయినర్లకు కంటెయినర్ల సెల్ ఫోన్లను దోచుకెళ్లిపోతున్నారు. సెల్ ఫోన్ తయారీ పరిశ్రమలు.. ఏపీలో.. తమిళనాడులో ఎక్కువగా ఉండటం… అక్కడి నుంచి జాతీయ రహదారుల మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. అలాంటి కంటెయినర్లను టార్గెట్ చేసుకుని వరుసగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎలా పాల్పడుతున్నారో.. డ్రైవర్లకు కూడా తెలియదు. జేబు కొట్టేసిన తర్వాత ఎవరో వచ్చి మీ జెబు చిరిగిపోయిందని… చెప్పే వరకూ తెలియనట్లుగా.. మీ కంటెయినర్ తలుపులు తీసి ఉన్నాయని.. వేరే వాళ్లు చెబితే కానీ డ్రైవర్లకు తెలియనంత స్మార్ట్‌గా దోపిడీ చేసేస్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై ఉన్న మాసాయిపేట షేర్ వద్ద చెన్నై నుండి ఢిల్లీ వెళుతున్న కంటైనర్ నుండి సెల్ఫోన్ల బాక్స్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. డ్రైవర్ ఓ దాబా వద్ద ఆగి అరగంట సేపు భోజనం చేశారు. అంతే.. ఈ సమయంలో దొంగలు తమ పని పూర్తి చేశారు. ఈ విషయం తెలియక డ్రైవర్ యధావిధిగా లారీని తీసుకెళ్లాడు. ఆదిలాబాద్ వెళ్లాక ఎవరో చెప్పడంతో చూసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా దొంగతనం జరగడం ఇదే మొదటి సారి కాదు.. వారం రోజుల క్రితం..గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై సెల్ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌లో ఇదే తరహా చోరీ జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కంటైనర్ వెనుక భాగం పగులగొట్టి ఫోన్లను చోరీ చేశారు దుండగులు.
గత నెలలో ఇలాంటి భారీ చోరీనే.. తమిళనాడు బోర్డర్లో జరిగింది. సుమారు 5 కోట్ల విలువైన సెల్ఫోన్లతో బయలుదేరిన కంటెయినర్ తమిళనాడు నుంచి ముంబైకి బయల్దేరిన లారీ తమిళనాడు బోర్డర్ కూడా దాటక ముందే సినీ ఫక్కీలో హైజాక్‌కు గురైంది. మరో లారీలో కంటైనర్‌ను వెంబడించిన దుండగులు.. డ్రైవర్‌ను కొట్టి కంటైనర్‌ను తీసుకెళ్లారు. కొంతదూరం వెళ్లాక అందులో ఉన్న 16 బాక్సుల్లో 8 బాక్సులు.. అంటే సుమారు 5 కోట్ల విలువైన సరుకును తీసుకెళ్లిపోయారు
వరుసగా జాతీయ రహదారిపై రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక్కో టార్గెట్ పెట్టుకుని ఒక్కో కంటెయినర్‌ని .. అదీ కూడా కేవలం సెల్ ఫోన్లనే దోపిడీ చేస్తున్నారు దొంగరు. జాతీయ రహదారులపై వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెగబడే మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠానే ఈ పని చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు చాలా ఏళ్లుగా దోపిడీలకు పాల్పడుతున్నప్పటికీ.. దొరలేదు. ముఠాల్లో ఒకరిద్దరు పట్టుబడినా ఒక్కరు కూడా వివరాలు బయటకుచెప్పరు. సాంకేతికతపై పూర్తి అవగాహనతో .. దోచుకున్న సొమ్మును తేలిగ్గా నగదుగా మార్చుకుంటారు. ఇప్పుడు వీరిని పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ధూమ్ దొంగలు ఇప్పుడు పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.