శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు జరిగింది. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో పన్నెండు రోజుల కిందటే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది చనిపోయారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పటికీ దర్యాప్తులో తేలలేదు. ఊహంచని విధంగా జరిగిన ప్రమాదంపై ప్రభుత్వానికి విచారణకు ఆదేశించింది.
అప్పటి నుంచి ప్లాంట్ పని చేయడం లేదు. ప్రస్తుతం ప్లాంట్ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంటలు రేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే .. విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం… అది అగ్నిప్రమాదం కాదని తల్చేశారు. సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారో తేల్చుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పుకొచ్చారు. మాక్ డ్రిల్ నిర్వహణలో ప్లాంట్ లోపల మంటలు వచ్చేలా ఎలాంటి ఏర్పాట్లు చేయరు.
ఏదైనా మాక్ డ్రిల్ చేయాలనుకుంటే.. పొగల వరకే పరిమితం అవుతారు. అసలే సున్నితమైన ప్రాంతం.. అందులో మాక్ డ్రిల్ పేరుతో… మంటలు రేపే ప్రయత్నం చేయరని అంటున్నారు. ఇప్పటికే ప్లాంట్లో అగ్నిప్రమాదంలో తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో.. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపేందుకు…మాక్ డ్రిల్ అని అంటున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.