ఇక నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలన్నా… ఆ రాష్ట్రం కేంద్ర పాలన అమలవుతుంది. దానికి ఆర్టికల్ 360 అవసరం లేదు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ సరిపోతుంది. ఆ విషయాన్ని… ఈ ఎన్నికలతో ఈసీ నిరూపించేసింది.
రాష్ట్రాల్లో కోడ్ అంటే కేంద్ర పాలన విధించడమే..!
రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం… ఎన్నికల ప్రకటన చేసినప్పటి నుంచి..మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం.. ఎన్నికల నిర్వహణ కోసం..ప్రభుత్వ యంత్రాంగం అంతా.. ఈసీ డిప్యూటేషన్ కిందకు వెళ్లిపోతుంది. అంటే..దీనర్థం.. ఎన్నికల సంఘం కానీ.. ఎన్నికల సంఘం నియమించే లేదా బదిలీ చేసే అధికారులు కానీ… పాలనను తమ చేతుల్లోకి తీసుకోవడం కాదు. ఎన్నికల సంఘం .. పర్యవేక్షణలోకి..యంత్రాంగం మొత్తం వెళ్లేది.. కేవలం ఎన్నికల నిర్వహణ విధుల కోసమే. ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించడానికే. అంతే కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్..యంత్రాంగం మొత్తం.. తన చేతిలో ఉంది కాబట్టి… ప్రధానమంత్రి చేసే పనులు తాను చేస్తాననకూడదు. అలాగే రాష్ట్రాల్లో ఉండే సీఈవోలకూ ఇది వర్తిస్తుంది. సీఎం చేసే పనులు తాము చేస్తామని లేదా..ఈసీ నియమించిన అధికారులతో చేయిస్తామడం సాధ్యం కాదు. కానీ విచిత్రంగా ఇప్పుడు అదే చేస్తున్నారు.
ఏపీలో సీఎంకు అధికారులు ఉండని చెప్పిన కేంద్ర పాలన..!
మార్చి పదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. అప్పట్నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. మే ఇరవై మూడున కౌంటింగ్ . కౌంటింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత కోడ్ మే 27న ముగుస్తుంది. అంటే…ఎన్నికల కోడ్ ఆంక్షలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిపై ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రధానికి అన్ని శాఖల అధికారులు రిపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ పరిణామాలపై ఐబీ చీఫ్ రోజూ బ్రీఫింగ్ ఇస్తున్నారు. రాష్ట్రాలకు వచ్చే సరికి.. ఆ కోడ్ తుపాను ఫణి అంత స్థాయికి వెళ్లిపోయింది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలను తుడిచి పెట్టేసి.. అధికారులే.. తామే అత్యున్నతం అని నిర్భయంగా ప్రకటించునేంతగా బలం పుంజుకుంది. దానికి ఏపీనే ఉదాహరణ. కోడ్ ఉంది కాబట్టి… సీఎంకు అధికారాలు ఉండవని సీఎస్ రూలింగ్ ఇచ్చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసిన ఈసీ..!
భారత ప్రజాస్వామ్యం… అత్యంత పటిష్టంగా వెలుగొందడానికి రాజ్యాంగంలోనే పలు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే వీటితోనే… ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భావించారు. ఆ స్వతంత్రసంస్థలను నడిపేవారి వ్యవహారశైలి ఎంత నిజాయితీగా ఉంటుందో…అప్పుడు మాత్రం..వాటి వల్ల ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే..శేషన్ ఉన్నప్పుడు.. ఒకలా.. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. ఈ పరిస్థితి మారడానికి ఏం చేయాలి..? అందరికీ కోడ్ ఒకేలా అమలు చేయలేరా..? కోడ్ పేరుతో పాలన కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా కరెక్టేనా..?. రాజ్యాంగం ప్రకారం.. ఐఎఎస్ లయిన అధికారులు…ప్రజాప్రభుత్వాన్ని ధిక్కరించి మాట్లాడే పరిస్థితి రావడం ప్రమాదకరం కాదా..?. రేపు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు.. కేంద్రం రాజకీయ దురుద్దేశంతో…కోడ్ పేరుతో… రాష్ట్ర ప్రభుత్వాలను గుప్పిట్లోకి తీసుకుంటే… రాజ్యాంగం అపహాస్యం పాలయినట్లే కదా..!. ఆ ప్రమాదకర పరిస్థితిని ఈ సారి ఈసీ తెచ్చి పెట్టింది..!