”కమ్యూనికేషన్, కేన్వాసింగ్ అనే మంత్రాలను సమర్థంగా ప్రయోగించడం ద్వారా నాయకుడిగా ప్రజాదరణను సృష్టించుకోవడం ఎలా?” అనే అద్భుతమైన మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా తమను తాము హైప్ సృష్టించుకోవడం అనేది ప్రధాని నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియకపోవచ్చు. తాను చేసే పనుల గురించి విపరీతమైన ప్రచారాన్ని సృష్టించుకోవడం.. ప్రజాదరణ ఉన్నట్లుగా ఒక భావను వ్యాప్తి చేయడం ఆయనకు పదవులతో పెట్టిన విద్య. అలాంటి మోడీ ఇప్పుడు తన సొంత పార్టీ భాజపాకు చెందిన ఎంపీలందరినీ కూడా.. తన కీర్తి ప్రచారానికి పావులుగా వాడుకోదలచుకుంటున్నారు. రెండేళ్ల పాలన మీద ప్రజల్లో డప్పు కొట్టాల్సిందిగా వారందరికీ ‘కీ’ ఇచ్చి ప్రజల్లోకి పంపడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు.
భాజపా ఎంపీలు అందరూ వారం రోజుల పాటూ నియోజకవర్గాల్లో నే ఉండి, అక్కడే రాత్రిళ్లు కూడా నిద్రించి రెండేళ్ల మోడీ పాలనలో సాధించిన విజయాల గురించి ప్రచారం నిర్వహించాలంటూ నరేంద్రమోడీ తాజాగా దిశానిర్దేశం చేయడం ఇలాగే కనిపిస్తోంది. పైకి మాత్రం ఈ సందర్భంగా ప్రజలనుంచి కొత్తగా సమస్యలు కూడా తెలుసుకోవాలని, దేశవ్యాప్తంగా ప్రజలనుంచి స్వీకరించిన వినతులు, తెలుసుకున్న సమస్యలు అన్నీ 26వ తేదీలోగా ప్రధానికి నివేదించాలని అంటున్నారు గానీ.. ఆయన స్కెచ్‌లోని అసలు అంతరార్థం తన సొంత ప్రభుత్వానికి డప్పు కొట్టుకోవడం మాత్రమే అని వినతుల గురించి కాదని జనం అనుకుంటున్నారు.
మోడీ ఆ బాద్యతను కేవలం ఎంపీలకు మాత్రమే పంచలేదు. కేంద్రంలోని భాజపా మంత్రులకు కూడా అదే హితవు చెప్పారు. భాజపా మంత్రులందరూ కలసి దేశంలో 200 ప్రాంతాల్లో పర్యటించి కేంద్రం సాధిస్తున్న విజయాల గురించి ప్రచారం చేయాలట. ఆ మేరకు వారికి ఓ రూట్‌మ్యాప్ కూడా సిద్ధమైపోయింది. అయినా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే.. ఆటోమేటిగ్గా వారి పనితీరు ప్రజలకు తెలిసి పోతూ ఉంటుంది. తాము అనుభవించే అభివృద్ధి ఫలాలు ప్రభుత్వం పుణ్యమే అని తెలుసుకోలేని స్థితిలో జనం ఉండరు. కానీ మన డప్పు మనమే కొట్టుకోవాలన్నట్లుగా ఎంపీలను, మంత్రులను జనం మీదికి తోలడం మోడీలోని కీర్తికాంక్షకు నిదర్శనంగా ఉంది.
మరోవైపు విజయాల ప్రచారానికి వారు సిద్ధంగానే ఉంటారు గానీ.. ప్రజల వినతుల స్వీకరణ మొక్కుబడి తంతు అవుతుందనే వారూ ఉన్నారు. మోడీ తాను చేయదలచుకున్నది ప్రజల నోటిద్వారా వస్తే వినిపించుకుంటారు తప్ప.. ప్రజలు నిజంగా వారి సమస్యలను నివేదిస్తే పట్టించుకునే రకం కాదని నాయకులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.