కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరుతున్నారు. ఆయన అనుచరవర్గం బీజేపీలో ఉండగా ఆయన చేర్పించిన నేతలు.. ఇటీవల జిల్లాల అధ్యక్ష పదవులు కోల్పోయిన వారు కూడా టీడీపీలో చేరుతారు. ముందు విష్ణుకుమార్ రాజు.. కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకెంత మంది వచ్చి చేరుతారో స్పష్టత లేదు. కానీ.. ఓ రకంగా బీజేపీ మొత్తం టీడీపీలో చేరుతున్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా… బీజేపీ హైకమాండ్ పట్టనట్లుగా ఉంటోంది.
బీజేపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని ఓ బీజేపీ నేత హెచ్చరించారు. అయితే ఆయన రాష్ట్ర నేత. కానీ ఆ స్థాయి హెచ్చరికలు ఢిల్లీ నుంచి వస్తే…. బీజేపీ నేతల్ని చేర్చుకునేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా వెనుకడుగు వేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం… బీజేపీ నుంచి వచ్చిన నేతలందర్నీ చేర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆకర్ష్ ప్రయోగించకపోయినా బీజేపీలో ఇమడలేక బయటకు వస్తున్నారు. అలా వస్తున్న వారు రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ మోదీ, షా అంటే ఎంతో గౌరవం అని చెబుతున్నారు.
ఒక వేళ తమ నేతల్ని చేర్చుకుంటున్నందుకు.. బీజేపీ హైకమాండ్‌కు కోపం వస్తే.. టీడీపీ అధ్యక్షుడు అయినా వైసీపీ నేత అయినా ఇబ్బంది పడాల్సిందే. చేయదల్చుకుంటే పార్టీ మారకుండా చేయగలరు కూడా., గతంలో వైసీపీలో చేరాలనుకున్న కన్నాను అమిత్ షా చివరి నిమిషంలో నిలిపివేశారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది.