నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్.. బీజేపీ బలోపేతానికి కారణమైన కూటమి. కానీ మోదీ, షాల చేతికి బీజేపీకి చిక్కిన తర్వాత…. ఆ కూటమిలో ఉన్న పార్టీల్ని ఒక్కో దాన్ని మింగడం ప్రారంభించారు. వారి కుట్రల్ని గుర్తించి బయటకు వచ్చిన పార్టీల ఉనికిని కాపాడుకుంటున్నాయి. వారి గుప్పిట చిక్కిన శివసేన వంటి పార్టీలు చిక్కి శల్యమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకు.. మరోసారి మిత్రపక్షాల అవసరం గుర్తు వచ్చింది. వచ్చే ఎన్నికల తర్వాత గడ్డు పరిస్థితి ఉంటుందని క్లారిటీ రావడంతో కొత్త మిత్రుల కోసం రంగంలోకి దిగారు.
బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకేరకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. గతంలో వచ్చిన ఏకపక్ష పలితాలు ఈ సారి రాకపోవచ్చని బీజేపీకి కూడా ఓ అంచనాకు వచ్చింది. తగ్గిపోతున్న సీట్లన్నింటినీ భర్తీ చేసుకోవాలంటే.. బీజేపీకి ఉన్న ఒకే ఒక్క మార్గం మిత్రపక్షాలను సాధించుకోవడం. పాతికేళ్ల కింద అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఎన్.డి.ఏ. ఏర్పడినప్పుడు దాదాపు మూడు పదుల పార్టీలు ఆ కూటమిలో ఉండేవి. ఇప్పుడు ఎన్.డి.ఏ. లో మిగిలిందల్లా మహారాష్ట్రలో శివసేన నుంచి చీలిపోగా మిగిలిన షిండే వర్గం, పశుపతి పారస్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి, అప్నా దళ్‌కు చెందిన సోనేలాల్ వర్గం, తమిళనాడులో అన్నా డి.ఎం.కె. మాత్రమే. ఇవన్నీ చాలా చిన్న పార్టీలే. అసలు సీట్లు సాధిస్తాయో లేదో చెప్పలేని పార్టీలు.
అందుకని ఒకప్పుడు ఎన్.డి.ఏ. భాగస్వామ్యం ఉన్న తెలుగు దేశం, పంజాబ్‌లోని అకాలీ దళ్ , కర్ణాటకలో జేడీఎస్ లాంటి పార్టీలను మళ్లీ ఎన్.డి.ఏ. లో భాగం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. పాత మిత్రులు పోతే కొత్త మిత్రులతో భర్తీకి యత్నం మోడీ అమిత్‌షాల ద్వయం చేస్తోంది. కొత్త మిత్రుల్ని పొందడానికి బీజేపీ చేస్తే ప్రయత్నాలు ఎంత సక్సెస్ అవుతాయన్నది రాజకీయవర్గాలకు సైతం అంతుబట్టడం లేదు. ఎందుకంటే… బీజేపీ రాజకీయాన్ని మిత్రపక్ష పార్టీలు అంత తేలికగా నమ్మలేవు.