తెలంగాణ ముందస్తు ఎన్నికలను కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగానే మారుతోంది! ఎందుకంటే, ఈ మధ్య కేసీఆర్ కీ, ప్రధాని మోడీకి మధ్య చాలా సాన్నిహిత్యం పెరిగింది. అసెంబ్లీ రద్దు తలపెట్టిన దగ్గర్నుంచీ వరుసగా ఓ మూడుసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు కేసీఆర్. నవంబర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన ప్రయత్నాల్నీ చేశారు. గురువారం కూడా కేసీఆర్ కేబినెట్ లో ఒక కీలక నేత రాత్రికిరాత్రే ఢిల్లీ వెళ్లి, నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కలిపి ఎన్నికలు జరిగే అంశమై మంతనాలు సాగించినట్టు సమాచారం. ఏదైమనా, కేంద్రం దృష్టిలో ఇప్పుడు కేసీఆర్ మంచి స్థానంలోనే ఉన్నారన్నది వాస్తవం.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ అని కేసీఆర్ విమర్శించడం మోడీకి బాగా నచ్చేసిందట! ఇదే విషయాన్ని కొంతమంది భాజపా నేతలతో మాట్లాడినట్టు సమాచారం. నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి రాహుల్ వరకూ కేసీఆర్ విమర్శిస్తున్న తీరు కూడా మోడీకి బాగానే నచ్చుతోందట! భాజపా లక్ష్యం కూడా అదే కదా. అయితే, నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం మనకు లేదంటూ కొంతమంది కిందిస్థాయి భాజపా నేతలు మోడీకి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో భాజపాకి కొత్తగా పెరిగేదీ ఒరిగేదీ ఈ ఎన్నికల్లో ఏమీ ఉండదన్న లెక్కల ప్రకారం ఇలాంటి నివేదికలు మోడీకి చేరాయని అంటున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారనీ వినిపిస్తోంది.
అయితే, భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి, ఈ సమయంలో తెరాసకు కొంత అనుకూల వైఖరితో వ్యవహరిస్తేనే మేలనేది మోడీ షా ద్వయం వ్యూహం అవుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు సానుకూలంగా ఎంతో కొంత సాయం మోడీ చెయ్యకపోతే… లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ వైఖరి మరోలా మారిపోతుందనీ, లోక్ సభ ఎన్నికల తరువాత కొంతమంది ఎంపీల మద్దతు అవసరం పడితే… ఆ మేరకు తెరాస నుంచి మద్దతు లభించే విధంగా ఇప్పట్నుంచే ఒక నేపథ్యాన్ని సెట్ చేసి పెట్టుకుంటే మంచిదనే లెక్కల్లో మోడీ షా వ్యూహం ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కాబట్టి, ఎన్నికల విషయమై కేసీఆర్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాజపా నుంచి ఏదో ఒక రకమైన సాయం అందుతుందనే అంచనాలే ఉన్నాయి.