భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. వీరికి ఈ మధ్య భక్తి చాలా ఎక్కువైపోయింది! విగ్రహాలు కనిపించడమే ఆలస్యం.. ఛాన్స్ వదలుకోవడం లేదు. దండం పెట్టేసి, దండలేసేస్తున్నారు. వెంటనే ఆ సమాచారం కర్ణాటక మీడియాలో ప్రసారం అయ్యేలా చూసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో భాజపా ఆపసోపాలు పడుతోంది. ఈ రాష్ట్రంలో గెలవడం ద్వారా దక్షిణాదిన పాగా వెయ్యొచ్చనేది కమలనాథుల ఆశ. అయితే, వారు ఆశించినట్టుగా కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితులు లేవనేదే విశ్లేషకుల మాట. దీంతో ఏదో ఒక రకంగా ప్రజలను ఆకర్షించడం కోసం మోడీ, అమిత్ షా ద్వయం చాలా ఫీట్లు చేస్తున్నారు. కర్ణాటకలో భక్తిభావం కాస్త ఎక్కువ. అక్కడ మఠాల ప్రభావం ప్రజలపై ఉంటుంది. కాబట్టి, ఆ భావంతోనే ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు.
పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్ ను ఆకర్షించడమే లక్ష్యంగా బసవ జయంతిని భారీ ఎత్తున భాజపా నిర్వహించింది. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన బసవన్న విగ్రహం బెంగళూరులో ఉంది. దానికి పూలమాల వేయడం కోసం ఎడ్యూరప్పతోపాటు అమిత్ షా ఒక క్రేనులో వెళ్లారు. విగ్రహం బాగా ఎత్తుగా ఉండటంతో… పూలదండను విసరాల్సి వచ్చింది. ఎడ్యూరప్ప విసిరిన పూలమాల బాగానే పడింది. కానీ, అమిత్ షా వేసిన మాల గురి తప్పింది. దీంతో భాజపా కార్యకర్తలు అపచారం అన్నట్టుగా ఫీలయ్యారట!
ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హఠాత్తుగా బసవన్న భక్తులు అయిపోయారు! ప్రస్తుతం మోడీ లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ పార్లమెంటు సమీపంలో ఉన్న బసవన్న విగ్రహం దగ్గరకి వెళ్లిపోయి పూలమాల వేశారు. ఆ సమాచారం ముందుగా కర్ణాటక మీడియాలో మాత్రమే ముందుగా వచ్చింది. ఇలా ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మోడీ, షా లు బసవన్న భక్తులుగా మారడం జరిగింది. ఇక, కర్ణాటకలో ఉన్న ప్రముఖ మఠాలన్నింటినీ అమిత్ షా వరుసగా ఇటీవలే దర్శనం చేసేసుకున్నారు. లింగాయత్ ల అనుగ్రహ సాధన కోసమే ఈ భక్తి ప్రదర్శనలోని రహస్యం అనేది అందరికీ తెలిసిందే.