గుజరాత్ ఎన్నికల తర్వాత దేశంలోనే గాక బిజెపిలోనే పరిస్థితులు ఎలా మారాయన్న దానికి అక్కడి ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఒత్తిడికి లొంగిన తీరే ఉదాహరణ. తననుంచి ఆర్థిక శాఖ లాగివేయడం గౌరవానికి భంగమని అది పునరుద్ధరిస్తే తప్ప బాధ్యతలు స్వీకరించేది లేదని నితిన్ భీష్మించుకున్నారు. మరో వైపున హార్దిక్ పటేల్ ఆయనను తిరుగుబాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. గుజరాత్లో ఎన్నడూ లేనంత తక్కువగా 99 సీట్లకు పడిపోయిన బిజెపి మెజార్టి అత్యల్పం అన్నది తెలిసినవిషయమే. అయితే ఇలాటి వాటికి లొంగే ప్రసక్తిలేదని ప్రధాని మోడీ అద్యక్షుడు అమిత్ షా ద్వయం మీడియా ద్వారా సంకేతాలు పంపించింది. భారీ కథనాలు రాయించింది. షా స్వయంగా గుజరాత్ పర్యటన పెట్టుకున్నారు. తీరా ఆయన వెళ్లిన తర్వాత జరిగింది వేరు. నితిన్ ఒత్తిడికి తలవొగ్గారు. ఆర్థిక శాఖ పునరుద్ధరించేందుకు చర్యలు ప్రకటించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా రాజీ ధోరణిలో ప్రకటన చేశారు. అంటే తిరుగులేదన్న కేంద్ర నాయకత్వం తలవంచక తప్పలేదన్న మాట. ఇది రాబోయే ఏడాదికి తొలి సంకేతంగా చూడవచ్చు.