అన్ని రాష్ట్రాలు తమకు సమానమే అని చెప్తారు. విభజన హామీలన్నీ అమలు చేసేశామంటారు! 85 శాతం హామీలు పూర్తి చేశామనీ, మరో నాలుగో ఐదో పెండింగులో ఉన్నాయనీ అవీ అయిపోతాయంటారు. జీవీఎల్ లాంటివారిని ఆంధ్రాపై ఉసిగొల్పి… టీడీపీపై విమర్శలు చేయడం ఒక్కటే లక్ష్యంగా వదుల్తున్నారు. ఇదంతా చేస్తూనే ఉల్టా రాష్ట్రంపై విమర్శలు చేస్తారు. చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే పొత్తు వదులుకున్నారంటారు! భాజపా యాంగిల్ నుంచి ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పుకుంటారు. కానీ, టీడీపీ విషయంలో, మరీ ముఖ్యంగా ఎంపీల విషయంలో తాజాగా అనుసరిస్తున్న తీరు చూస్తుంటే… ఆ పార్టీ ఎంత ఆగ్రహంగా ఉందో అర్థమౌతుంది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏవైనా సిఫార్సులు చేసినా, లేఖలు పంపించినా వాటిపై ఏమాత్రం స్పందివచొద్దని అంతర్గతంగా ప్రధాని నరేంద్ర మోడీ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది! ఎందుకంటే, ఇటీవల టీడీపీ అనుసరిస్తున్న తీరు జాతీయ స్థాయిలో భాజపాకి ఇబ్బందికరంగా మారిందన్న ఆగ్రహం తీవ్రంగా ఉందట! అంతేకాదు, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తాజాగా మోడీని కలిసిన సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పినట్టూ తెలుస్తోంది. తన మనవరాలి పెళ్లి శుభలేఖ ప్రధానికి ఇచ్చేందుకు రాయపాటి కలిశారు. ఈ సందర్భంగా దాదాపు ఓ పావుగంట సేపు ఏపీ రాజకీయాలపై మోడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ సీఎం అనుసరిస్తున్న తీరు సరిగా లేదనీ, ఆయన పద్ధతి ఇలా కొనసాగడం ఎవ్వరికీ మంచిది కాదనే రీతిలో రాయపాటితో మోడీ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాయపాటి కూడా చెప్పారు! ప్రధాని భేటీ తరువాత ఆయన కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మోడీ చాలా ఆగ్రహంతో ఉన్నారనీ, తనతో మాట్లాడినంత సేపూ అదే విషయమై పదేపదే చెప్పే ప్రయత్నం చేశారని కూడా ఆయన చెప్పినట్టు సమాచారం.
సో… ఏపీకి అన్నీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని కన్నా, వీర్రాజు, జీవీఎల్, విష్ణుకుమార్ రాజు వంటి నేతలు ఆంధ్రాలో మాట్లాడతారు. టీడీపీ సర్కారుకి తీసుకోవడం చేతకాదన్నట్టుగా మాట్లాడతారు. కానీ, ఏపీ ఎంపీల నుంచి ఏ చిన్న సిఫార్సులు వచ్చినా అనుమతించొద్దని స్వయంగా మోడీ స్వయంగా చెప్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఆంధ్రా ప్రజల సమస్యల కోణాన్ని వదిలేసి… కేవలం టీడీపీ తమతో విభేదించిందన్న రాజకీయ కోణాన్నే మోడీ చూస్తున్నారు. ఏ కారణాల వల్ల ఎన్డీయేపై టీడీపీ పోరాటం ప్రారంభించాల్సింది వచ్చిందన్న అంశాన్నీ పరిణించడం లేదన్నది పదేపదే స్పష్టమౌతూనే ఉంది. చంద్రబాబుపై ప్రస్తుతం మోడీ తీరు ఎలా ఉందని చెప్పడానికి ఇది ఇంకో ఉదాహరణగా చెప్పొచ్చు.