తెలంగాణ తెచ్చుకున్న కారణం నియామకాల కోసం అని నిరుద్యోగులు గొంతు చించుకున్నా ఎనిమిదేళ్ల పాటు పట్టించుకోని కేసీఆర్ ఇటీవల ఏకంగా ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైతే ఓ పాతిక వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చారు. భర్తీ వరకూ ఎన్ని చేరుతాయో స్పష్టత లేదు కానీ..రేసులోకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా వచ్చారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వ మ్యాన్ పవర్ మీద ఓ రివ్యూ చేశానని చాలా మ్యాన్ పవర్ కొరతగా ఉందని తేలిందన్నారు. వెంటనే ఓ పది లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్లో ఏడాదిన్నరలో భర్తీ చేస్తామని ప్రకటించారు.
దీంతో చాలా మంది ఆహో.. ఓహో అనడం ప్రారంభించారు. ఇటీవలే కేటీఆర్ కేంద్రంలో పదిహేడు లక్షల ఉద్యోగాలు ఖాళీగాఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని లేఖ రాశారు. మరో వారంలోనే పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటన వచ్చింది. ఎలా భర్తీచేస్తారు.. ఎప్పుడు భర్తీ చేస్తారు.. అసలు మిషన్ మోడ్ అంటే ఏమిటి అన్నీ తేలాల్సి ఉంది. ఒక్కటి మాత్రం నిజం ప్రభుత్వాలు ఖాళీఅవుతున్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడం లేదు. రాజకీయ ఆట కోసం దాచిపెట్టుకుంటున్నాయి.
నిరుద్యోగుల్ని నాని తిప్పలు పెట్టి ఎప్పుడు రాజకీయ లాభం కలుగుతుందంటే అప్పుడు భర్తీ చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇంత కాలం ప్రభుత్వాలు మోసం చేశాయని తెలియని నిరుద్యోగులు అదే పదివేలు అనుకుని కోచింగ్లలో మునిగి తేలుతున్నారు. చివరికి వారికి ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదుకానీ.. ఎన్నికల వాతావరణం మాత్రం వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.