ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు. కరోనా ఉనికి దేశంలో ప్రారంభమైనప్పటి నుండి లాక్ డౌన్లు విధించే సమయంలో.. ఆయన మీడియా ముందుకు వచ్చి.. ప్రకటనలు చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో రాలేదు. మళ్లీ చైనాతో సరిహద్దు గొడవలు చెలరేగిన తర్వాత.. చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన తర్వాత రోజునే ఆయన జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. చైనా దురాక్రమణ అంతకంతకూ పెరుగుతోంది. కమాండర్ స్థాయి చర్చలు జరుపుతున్నప్పటికీ.. చైనా మాత్రం.. భారత భూభాగంలోకి దూసుకొస్తేనే ఉంది. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరో వైపు.. పాక్ భూభాగం మీద నుంచి కూడా.. ఇండియాను టార్గెట్ చేస్తూ.. కార్యకలాపాలు ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
భారత్ కూడా.. పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహాలు చేస్తోంది. సరిహద్దులలో ఆర్మీని మోహరిస్తోంది. వాయు సేన కూడా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో… కొద్దిరోజుల కిందట.. మోడీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరూ మోడీ సామర్థ్యంపై నమ్మకం ఉంచారు. చైనాకు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదని.. ధీటుగా బదులివ్వాలన్న అభిప్రాయం అంతటా వ్యక్తమయింది. దీంతో.. పరిస్థితులన్నింటినీ పరిశీలించిన కేంద్రం… చైనా విషయంో ఏం చేయాలన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనా సైనికులు భారత భూభాగంలోకి రాలేదని.. మోడీ అఖిలపక్ష సమావేశం సందర్భంగా చేసిన ప్రకటన కూడా వివాదాస్పదం అయింది. వీటన్నింటినీ మరిపించేలా.. చైనాకు చెక్ పెట్టేలా భారత వ్యూహాన్ని మోడీ ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది.
అలాగే.. కరోనా లాక్ డౌన్ 1 కూడా పూర్తయిపోయింది. లాక్ డౌన్ 2 నిబంధనల్ని కేంద్రం విడుదల చేసింది. కానీ.. కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కాలేదు. రోజు రోజుకు సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దీనిపైనా మోడీ.. కేంద్రం తరపున ప్రత్యేకమైన సూచనలు, సలహాలు ప్రజలకు ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ.. కరోనా వల్ల దెబ్బ తిన్న వ్యాపారాలు.. ఉద్యోగాలు గాడిలో పడలేదు. వీటన్నింటిపై ప్రధానమంత్రి ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది.